ఇటీవలి కాలంలో భార్యలు తమ భర్తలను హత్య చేస్తున్న లేదా దాడి చేస్తున్న సంఘటనలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాల కారణంగా జరిగే హత్యలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా నిలుస్తున్నాడని భావించి, కొందరు భార్యలు ప్రియుడి సహాయం తీసుకుని భర్తను హత్య చేస్తున్నారు. మరికొందరు తామే ధైర్యం తెచ్చుకుని నేరుగా హత్యలకు పాల్పడుతున్నారు.

అక్రమ సంబంధాలతో పాటు, దీర్ఘకాల కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక సమస్యలు, భర్త మద్యపానం లేదా వేధింపులు వంటి అంశాలు కూడా భార్యల్ని తీవ్రమైన చర్యలకు దారితీస్తున్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనలే తరచుగా వెలుగులోకి వస్తూ సమాజంలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
విశాఖపట్నంలో వేడినీళ్ల ఘటన
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది. భీమునిపట్నం పరిధిలోని నేరెళ్లవలసలో నందిక కృష్ణ, గౌతమి అనే దంపతులు ఆరు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి 2 గంటల సమయంలో కోపంతో రగిలిపోయిన గౌతమి, పడుకున్న భర్తపై సలసల కాగే వేడి నీళ్లు పోసింది. కృష్ణకు తీవ్ర గాయాలు కాకపోయినా, వెంటనే అతడిని విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స జరుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీలో కరెంట్ షాక్‌తో హత్య
ఇలాంటి సంఘటనలు కేవలం ఏపీతో మాత్రమే పరిమితం కావు. ఇటీవల ఢిల్లీలో జరిగిన మరో కేసులో, 36 ఏళ్ల వ్యక్తి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. మొదట ఇది సహజ మరణంగా భావించగా, తరువాత అతని భార్య తన కజిన్‌తో ఉన్న చాట్స్ ఆధారంగా ఇది హత్య అని పోలీసులు నిర్ధారించారు. అక్రమ సంబంధం కారణంగా భార్య భర్తకు మత్తు ఇచ్చి, విద్యుదాఘాతంతో చంపినట్లు తేలింది. ఈ కేసులో భార్య సుష్మిత మరియు ఆమె కజిన్ రాహుల్లను పోలీసులు అరెస్టు చేశారు.
మేఘాలయలో హనీమూన్ హత్య
మరో షాకింగ్ సంఘటన మేఘాలయలో చోటుచేసుకుంది. అక్కడ హనీమూన్‌కి వెళ్లిన భర్త రాజా రఘువంశీని, అతని భార్య సోనమ్ తన ప్రియుడు రాజ్ కుశ్వాహా సహాయంతో హత్య చేయించినట్లు బయటపడింది. ఈ హత్యకు కూడా అక్రమ సంబంధమే కారణమని పోలీసులు నిర్ధారించారు.
నైతిక విలువలు, సామాజిక మార్పులపై ఆందోళన
ఇలాంటి వరుస సంఘటనలు సమాజంలో నైతిక విలువలు తగ్గిపోతున్నాయనే ఆందోళనను కలిగిస్తున్నాయి. కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు క్షీణిస్తున్న తీరుపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేరాలకు మూలకారణాలను గుర్తించి, సామాజిక మార్పులను తీసుకురావాల్సిన ఆవశ్యకతను ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.































