1976 సంవత్సరం అనేక చిత్రాలు వెండితెరపై కళకళలాడాయి. అందులో అంతులేనికథ, ఆరాధన, భలే దొంగలు, మునగాడు, సెక్రెటరీ, పాడిపంటలు లాంటి చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఇక దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఈ సంవత్సరం ఏకంగా ఆరు చిత్రాలు రూపొందించబడ్డాయి. అందులో పాడవోయి భారతీయుడా, యవ్వనం కాటేసింది, తూర్పు-పడమర, ముద్దబంతి పువ్వు, మనుషులంతా ఒక్కటే, ఓ మనిషి తిరిగి చూడు చిత్రాలు విడుదలయ్యాయి.

ఇందులో మనుషులంతా ఒక్కటే, తూర్పు పడమర చిత్రాలు విజయవంతంగా నిలిచాయి, మిగిలిన నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. దాసరి తన కెరీర్ ప్రారంభంలో స్టార్స్ లేకుండా సామాజిక చైతన్యంతో కూడిన అనేక చిత్రాలు రూపొందించారు. ఆ చిత్రాల విజయ పరంపరలో.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, లాంటి స్టార్స్ తో ఆయన ఎక్కువ చిత్రాలు రూపొందించారు. ఎన్టీఆర్ తో సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి.. ఏఎన్నార్ తో ఏడంతస్తుల మేడ, ప్రేమాభిషేకం శోభన్ బాబుతో స్వయంవరం, బలిపీఠం కృష్ణతో ఊరంతా సంక్రాంతి, కృష్ణార్జునులు.. కృష్ణంరాజుతో గోల్కొండ అబ్బులు, సీతారాములు లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను దాసరి నారాయణ రావు అందించారు.

1976 విజయబాపినీడు నిర్మాణం,దాసరి నారాయణరావు దర్శకత్వంలో “యవ్వనం కాటేసింది” చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో కృష్ణంరాజు, మురళీమోహన్, జయచిత్ర హీరో, హీరోయిన్లుగా నటించారు. 1975 రచయిత అరుణాచలం అందించిన కథతో “మయాంగ్ కిరళ్ ఓరు” అనే తమిళ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమా తమిళంలో విజయవంతం కావడంతో విజయబాపినీడు తెలుగులో ఆ సినిమాను రీమేక్ చేయాలనుకున్నారు. ముందుగా ఈ సినిమాకి దర్శకనిర్మాతలు “చెడిన ఆడది” అనే టైటిల్ అనుకున్నారు. కానీ అప్పటి “సెంట్రల్ సెన్సార్ బోర్డు” సభ్యుడిగా ఉన్న దర్శకుడు పి.పుల్లయ్య ఆ టైటిల్ ని తిరస్కరించారు.

అలా ఆ చిత్రానికి ఉన్న “చెడినఆడది” టైటిల్ ని తొలగిస్తూ “యవ్వనం కాటేసింది” అనే టైటిల్ ని పెట్టి సినిమాని 1976 లో విడుదల చేయడం జరిగింది. కానీ దర్శకుడు దాసరి నారాయణరావు తన సినిమాలకు భిన్నంగా రూపొందించిన ఈ సినిమా కుర్ర ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికి బాక్సాఫీస్ వద్ద ఒక ఫెయిల్యూర్ గా నిలిచింది.ఆ తర్వాత భరతన్ దర్శకత్వంలో జయభారతి హీరోయిన్ గా “యవ్వనం కాటేసింది” అనే డబ్బింగ్ చిత్రం తెలుగులో విడుదల కావడం జరిగింది. రొమాంటిక్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాను ఆనాటి కుర్రకారు విజయవంతం చేశారు.































