YS Avinash Reddy : అవినాష్ అరెస్ట్ అయితే ఆ పాపం వైఎస్ జగన్ దే.. సీఎం చేసిన పెద్ద తప్పు ఇదేనంటూ వైసీపీలో చర్చ.. అప్పట్లో చంద్రబాబు, కేసీఆర్ కూడా..!

0
239

YS Avinash Reddy : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఎవరైనా ఉన్నారంటే.. అది వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి.. వివేకా హత్య కేసులో సీబీఐ ఆయనను అరెస్ట్ చేస్తుందా? లేదా? ఆయన ఎలా తప్పించుకుంటారు? అనే అంశాలపై ఆసక్తికర చర్చ అయితే బీభత్సంగా నడుస్తోంది. ఒకవైపు అవినాష్ తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ ఆసుపత్రి నుంచి బయటకు కూడా రావట్లేదు.. అలాగని సీబీఐ ఊరుకుంటుందా? కేంద్రం నుంచి బలగాలు వస్తున్నాయని.. అవినాష్‌ను అరెస్ట్ చేసి తీరుతామంటూ ఏవేవో లీకులు ఇస్తూ కర్నూలులోనే మకాం వేసింది. ఈ దాగుడు మూతలు ఇంకెంత కాలమనేది సామాన్య జనానికి అర్థం కాని పరిస్థితి. అయితే ఇప్పుడు రాష్ట్రంలో మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒకవేళ అవినాష్ అరెస్ట్ అయితే మాత్రం ఆ పాపం సీఎం వైఎస్ జగన్‌దేనట. సీఎం చేసిన తప్పు వల్లే ఈ పరిణామాలన్నీ అంటూ చర్చ జరుగుతోంది. అసలు సీఎం ఏం చేశారు?.. అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై స్పెషల్ స్టోరీ..!

మన గొయ్యి మనమే తవ్వుకున్నామా?
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఆయన చంద్రబాబు ప్రభుత్వం విధించిన సీబీఐ నిషేధాన్ని ఎత్తివేశారు. ఒకవేళ ఇదే కంటిన్యూ అయ్యుంటే.. ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. చంద్రబాబును ఇరికించాలని యత్నించి జగన్ తన గొయ్యి తనే తవ్వుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆయన బ్యాన్ చేశారు.. అబ్బే మనకేం అని పంతానికి వెళ్లి మరీ సీబీఐకి ఎంట్రీ ఇచ్చేశారు. ఇప్పుడు జగన్ అలోచనలో పడ్డారు. అయితే ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులు.. పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డిని ఏక్షణమైన సీబీఐ అరెస్ట్ చేస్తారనే వార్తలు వినవస్తున్న నేపథ్యంలో సీబీఐ బ్యాన్ ఎత్తివేసి తప్పు చేశామా? మన గొయ్యి మనమే తవ్వుకున్నామా? అని పార్టీ నేతలతో జగన్ చర్చించినట్టు తెలుస్తోంది. పక్క రాష్ట్రంలో కేసీఆర్ సీబీఐని నిషేధించారంటూ అప్పట్లో టాక్ నడిచింది. అధికారికంగా అయితే ప్రకటన అయితే ఏమీ చేయలేదు.

రచ్చ అంతటికీ జగనే కారణం…

ఇటు చంద్రబాబు, అటు కేసీఆర్ వంటి ఇద్దరు సీనియర్ నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థను నిషేధించారంటే దానికి వెనుక ఉన్న కారణాన్ని జగన్ ఊహించలేకపోయారు. దర్యాప్తు సంస్థ అయిన సీబీఐని అప్పట్లో కేంద్రం దుర్వినియోగం చేస్తోందని చంద్రబాబు.. కేసిఆర్ ఆలా నిర్ణయం తీసుకున్నారు. కానీ అసలు విషయం గ్రహించక జగన్ తప్పులో కాలేశారు. చంద్రబాబుపై కోపంతో కొరివితో తలగోక్కున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి ఇప్పుడు అవినాష్ రెడ్డి విషయంలో జరుగుతున్న రచ్చకు అంతటికీ కారణం జగనేనని వైసీపీ నేతలు సైతం చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఏపీలో అయితే హైడ్రామా రసవత్తరంగా నడుస్తోంది. బెయిల్ కోసం అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. ఒకవేళ పాజిటివ్‌గా వస్తే ఓకే. నెగిటివ్‌గా వస్తే ఏం చేయాలో కూడా సీఎం జగన్ ఆలోచించారనే టాక్ నడుస్తోంది.

జనాల్లో బీభత్సంగా నెగిటివ్ టాక్..

కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి విషయంలో రోజుల తరబడి సాగుతున్న దాగుడు మూతలకు మొత్తానికి నేడో రేపో తెర పడే అవకాశం ఉంది. పాజిటివ్‌గా వస్తే ఓకే.. లేదంటే అవినాష్‌కు లొంగిపొమ్మని సలహా ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నడిపిస్తున్న హైడ్రామాతో జనంలో చెడ్డపేరు వస్తోందని సీఎం జగన్‌ శిబిరం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కావాలనే తల్లి అనారోగ్యం డ్రామా ఆడుతున్నారంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. జనాల్లో కూడా ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. హాస్పిటల్ బయట పెద్ద ఎత్తున వైసీపీ క్యాడర్‌ను సీబీఐని అడ్డుకోవడం కోసం కాపలా ఉంచడం వంటి అంశాల పట్ల జనాల్లో నెగిటివ్ టాక్ బీభత్సంగానే నడుస్తోంది. దీంతో ఈ రచ్చకు ఇక ఫుల్‌స్టాప్‌ పెట్టాలని జగన్ అండ్ కో భావిస్తున్నట్టు సమాచారం. మంగళవారం సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా నిర్ణయం వెలువడకపోతే… ఆయనే సీబీఐ విచారణకు హాజరయ్యేలా అవినాశ్‌ను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక చూడాలి ఏం జరుగుతుందో..!