YS Sharmila : జగనన్న విడిచిన బాణంగా తెలుగు రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ షర్మిల రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా వైఎస్ జగన్ చెల్లిగా రాజకీయాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా అన్నకు అండగా నిలబడిన షర్మిల ప్రస్తుతం తెలంగాణలో కెసిఆర్ నియంతృత్వ పాలనపై మరోసారి పోరాటం చేస్తానంటూ తెలంగాణలో పార్టీ పెట్టింది. ఇక రాజకీయంగా మరోసారి తానేంటో చూపించడానికి సిద్ధమైన షర్మిల అపుడు అన్న కోసం పోరాడితే ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం కెసిఆర్ తో పోరాడుతా అంటోంది. అయితే తాజాగా షర్మిల కడపలో తనకున్న ఆస్తులను పిల్లలకి పంచింది.

కొడుకు, కూతురుకి ఆస్తులు ఇచ్చిన షర్మిల…
కడపలో తన పేరిట ఉన్న ఆస్తులను వైఎస్ షర్మిల తాజాగా తన పిల్లలకు రాసిచ్చారు. కడప సమీపంలోని వేంపల్లె దగ్గర ఉన్న 9 ఎకరాల 50 సెంట్ల భూమిని కొడుకు రాజారెడ్డి పేరు మీదకి మార్చిన షర్మిల మరో చోట ఉన్న 2 ఎకరాల భూమిని కూతురు అంజలి పేరు మీదకి మార్చారు. అలాగే తాను గతంలో కొనుగోలు చేసిన నిమ్మతోటను కూతురు అంజలి కి రాసిచ్చారు షర్మిల.

పిల్లలిద్దరూ యుక్తవయసుకి రావడం వల్ల ఆస్తుల పంపకం చేసారా లేక రాబోయే తెలంగాణ ఎన్నికలకు ముందస్తుగానే జాగ్రత్త పడ్డారా అనే విషయం తెలియదు. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకొని వేంపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అప్పటికే రిజిస్ట్రేషన్ కి సంబంధించిన పనులు జరుగగా షర్మిల తన పిల్లలతో వచ్చి సంతకాలను చేసి ఇడుపాలపాయకి వెళ్లారు.





























