పక్షవాతం లక్షణాలు కనబడగానే ప్రతి నిమిషం ప్రధానమే. ఎంత త్వరగా ఆసుపత్రికి వెళితే ఫలితం ఉంటుంది. ఆసుపత్రికి వెళ్లగానే వెంటనే మెదడు ‘సిటీ స్కాన్’ తీసి చూస్తారు. రక్తనాళాల్లో పూడిక వల్లే రక్తసరఫరా నిలిచిపోయి పక్షవాతం వచ్చినట్లు తేలితే ఆ పూడిక కరిగిపోయేందుకు వెంటనే ‘టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్- టీపీఏ’ ఇంజక్షన్ మొదలుపెట్టేస్తారు. దీన్ని మూడు గంటల్లోపు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగున్నర గంటల వరకూ కూడా ఇవ్వొచ్చు. ముఖ్యమైన విషయం ఏమంటే- ‘టీపీఏ’ అన్నది మరణాన్ని నివారించలేదు. సాధారణంగా పక్షవాతం బారినపడ్డవారిలో మూడింట ఒకరు మరణించే అవకాశం ఉంటుంది. ఇలాంటి మరణాలు 48-72 గంటల్లో ఎక్కువ. అందుకే ఈ సమయంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు అత్యవసర చికిత్స అవసరమవుతుంటుంది.
* మెదడులో కొంత భాగం దెబ్బతింటుంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో అవసరమైతే మెదడుకు ఆక్సిజన్ సరఫరా చేయాల్సి రావొచ్చు. మెదడుకు రక్తసరఫరా తగ్గితే అందులోకి నీరు వచ్చి చేరుతుంది. దీంతో మెదడు పెద్దగా అవుతుంది. అందువల్ల దీన్ని తగ్గించటానికీ మందులు ఇస్తారు. ఇలా సకాలంలో ‘టీపీఏ’ ఇవ్వటంతో పాటు పరిస్థితిని బట్టి ఉపశమన చికిత్స కూడా అవసరమవుతుంది.
* పక్షవాతం లక్షణాలు కనబడిన 3 గంటలలోపు ‘టీపీఏ’ చికిత్స మొదలుపెట్టేస్తే కోలుకునే వేగం బాగా పెరుగుతుంది. ఒకవేళ నాలుగు గంటల తర్వాత ఆసుపత్రికి వస్తే- సీటీ స్కాన్‌లో పూడిక వచ్చినట్లు చూస్తూనే వెంటనే వారిని యాంజియోగ్రామ్‌కు తీసుకువెళ్లి.. దానిలో తీగగొట్టం ద్వారా నేరుగా పూడిక వచ్చినచోట, రక్తం గడ్డకట్టిన ప్రాంతంలోనే మందును వదులులుతారు. దానితో అది చాలా వరకూ కరిగిపోతుంది.
* ఒకవేళ అది విఫలమైతే ‘ఎంఈఆర్‌సీఐ’ లేదా ‘పెనంబ్రా’ వంటి సున్నిత పరికరాలతో ఆ గడ్డను బయటకు తీస్తారు. దీంతో మెదడులో మళ్లీ రక్తసరఫరా ఆరంభమవుతుంది. దీన్ని పక్షవాతం వచ్చిన 6-8 గంటల వరకూ చేసే అవకాశం ఉంటుంది.
* ఒకవేళ మెదడులో రక్తనాళం చిట్లటం వల్ల సమస్య తలెత్తితే.. మెదడులో ఒత్తిడి పెరగకుండా చూసేందుకు, ఆ చిట్లిన రక్తనాళాన్ని మూసివేసి తిరిగి రక్తసరఫరా పునరుద్ధరించేందుకు చాలాసందర్భాల్లో అత్యవసరంగా సర్జరీ అవసరమవుతుంది.