దక్షిణ భారతీయుల రోజువారీ ఆహారంలో ఇడ్లీ, దోశలకు ప్రత్యేక స్థానం ఉంది. వేగవంతమైన జీవనశైలిలో సమయం ఆదా కోసం చాలామంది ఒకేసారి ఎక్కువ మోతాదులో దోస పిండిని తయారు చేసి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతున్నారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యపరంగా సమస్యలకు దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిండిని ఎక్కువ రోజులు ఉంచి వాడటం వల్ల దాని గుణాలు మారిపోతాయని చెబుతున్నారు.

సాధారణంగా బియ్యం, మినప్పప్పుతో తయారయ్యే దోస పిండిని పులియబెట్టడం వల్ల అందులో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. కానీ ఫ్రిజ్‌లో ఉంచినా పులియబెట్టే ప్రక్రియ పూర్తిగా ఆగిపోదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత పిండిలోని పదార్థాలు విచ్ఛిన్నమై, ఆమ్లత్వం పెరిగే అవకాశం ఉంది. దీంతో పిండి నాణ్యత తగ్గి రుచి కూడా మారిపోతుంది.
మూడు రోజులకు మించి నిల్వ చేసిన పిండితో చేసిన ఆహారం తింటే కడుపులో మంట, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తవచ్చు. కొన్ని సందర్భాల్లో హానికరమైన సూక్ష్మజీవులు పెరిగి ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం కూడా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఇలాంటి పిండితో చేసిన వంటకాలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు.
అందుకే పిండిని అవసరానికి సరిపడా మాత్రమే తయారు చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు రెండు లేదా మూడు రోజులకు సరిపడే మోతాదులోనే పిండిని రుబ్బుకోవాలి. నిల్వ కోసం స్టీల్ లేదా గాజు పాత్రలను ఉపయోగించడం సురక్షితం. పిండిని ఫ్రిజ్‌లో పెట్టే ముందు ఉప్పు కలపకుండా ఉంచితే పులియబెట్టే ప్రక్రియ కొంత మందగిస్తుంది. అవసరమైనప్పుడు మాత్రమే ఉప్పు కలిపి వాడటం ఉత్తమం.
పిండిలో వాసన మారడం, రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని వాడకుండా పారవేయడం మంచిది. తాజా పిండితో చేసిన దోశలు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచివి. కాబట్టి రుచి కంటే ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకుని, తాజాగా తయారు చేసిన పిండినే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.































