టీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు అయన సొంత నియోజకవర్గం సిరిసిల్ల మున్సిపాలిటీలో ఇండిపెండెంట్లు షాక్ ఇచ్చారు. మొత్తం 39 స్థానాల్లో 24 స్థానాలు టీఅర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమైంది. గెలిస్తే షాక్ ఏంటి అనుకుంటున్నారు కదా ? అసలు మేటర్ ఇక్కడే మొదలయింది. ఎందుకంటే 39 స్థానాల్లో 24 గెలిచినా.. మిగిలిన 15 స్థానాల్లో బీజేపీ 3, కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకోగా.. మిగిలిన 10 స్థానాల్లో మాత్రం స్వతంత్రులు గెలుపొందారు.
కేటీఆర్ ఇలాఖాలో స్వతంత్ర అభ్యర్థులు ఈ స్థాయిలో గెలవడంపై చర్చ జరుగుతుంది. అయితే గెలిచిన ఇండిపెండెంట్లలో ఎక్కువమంది తెరాసాకు చెందిన రెబల్ అభ్యర్థులే.. ఎన్నికలకు ముందు టికెట్ లభించకపోవడంతో టీఅర్ఎస్ పార్టీ తరుపున టికెట్ ఆశించి భంగపడిన చాలామంది రెబెల్స్ గా బరిలోకి దిగారు. ఎన్నికలకు ముందు రెబల్స్ ని బుజ్జగించేందుకు తెరాస పార్టీ చాలా ప్రయత్నాలే చేసింది, అందులో కొంతమంది పోటీనుంచి తప్పుకోగా మరికొందరు బరిలోకి దిగి విజయం సాధించారు. అయితే వీరంతా మళ్లీ టీఅర్ఎస్ గూటీకి చేరతారా లేదో సర్వత్రా ఆసక్తిగా మారింది.






























