ఒక భాషలో స్టార్ హీరోగా వెలుగుతున్న వారు మరో భాషలో అదే స్టార్ డం ని సంపాదించుకోవడం అంటే అంత సులభం కాదు. ఒక నటుడిగా భాషతో సంబంధం లేకుండా ఎవరినైనా అభిమానించే ప్రేక్షకులు కొందరికి మాత్రమే అభిమానులుగా మారతారు. అలాంటి వారిలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్‌ల తర్వాత మలయాళ మెగాస్టార్ గా పాపులరిటీ సాధించిన మమ్ముట్టి. ఈయనకి మన టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయనకి సమయం దొరకక తెలుగు సినిమాలలో నటించ లేకపోతున్నారు.

లేదంటే ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలో అద్భుతమైన పాత్రలు చేసుండేవారు. కాగా మలాయళ స్టార్ హీరోగా ఇప్పటికీ అసాధారమైన క్రేజ్ ఉన్న మమ్ముట్టి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నేటితో ( ఆగస్ట్ 7 ) సక్సెస్ ఫుల్ గా 50ఏళ్ళు పూర్తయ్యాయి. 1971 లో వచ్చిన ‘అనుభవాంగల్ పలిచకల్’ అనే మలాయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మమ్ముట్టి. ఇందులో ఓ చిన్న పాత్ర పోషించారు. 9179లో ‘దేవలోకం’ అనే సినిమాలో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించారు. కానీ ఈ సినిమా విడుదల కాలేదు.

అయితే 1980లో వచ్చిన ‘మేలా’ మమ్మూట్టి హీరోగా విడుదలైన మొదటి చిత్రం. ఈ సినిమా తర్వాత నటుడిగా ఆయన ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మలయాళ మెగాస్టార్‌గా పాపులారిటీ సాధించిన మమ్ముట్టి మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో 400 చిత్రాలకి పైగా నటించారు. అంతేకాదు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన నిర్మాతగానూ కొన్ని చిత్రాలను నిర్మించి సక్సెసులు అందుకున్నారు.

తమిళంలో – తెలుగు భాషలలో వచ్చిన ‘దళపతి’ వంటి మల్టీస్టారర్ సినిమాలలో నటించి కూడా బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు మమ్ముట్టి. సూపర్ స్టార్ రజనీకాంత్, మోహన్ లాల్ లాంటి స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితులు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘స్వాతి కిరణం’ ఆయనను తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర చేయడంతో పాటు వారిని ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకొని అఖండ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత మమ్ముట్టికి తెలుగు ప్రేక్షకుల్లోనూ క్రేజ్ పెరిగింది. ఆయన సినిమాలు ఇంకా వస్తే బావుంటుంది అనే ఆసక్తి తెలుగు జనాలలో కలిగించారు.

ఇక మహి వి రాఘవ దర్శకత్వంలో దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డి జీవిత కథ, పాద యాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమాలో నటించి ఆకట్టుకున్నారు. వాస్తవంగా ఈ సినిమా చేసే సమయంలో ఆయన మలయాళ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. అయినా కూడా మీరే నటించాలని దర్శకుడు పట్టు పట్టాడు. అయితే 6 నెలలు ఆగ గలిగితే యాత్ర చేస్తానని మాటిచ్చి, అలాగే చేశారు. వై.యస్.ఆర్ పాత్రలో జీవించారు మమ్ముట్టి. ఇటీవల ఆయన నటించిన ‘వన్’ చిత్రం కూడా తెలుగు ఓటీటీ ఆహాలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక మమ్ముట్టి సినీ ఇండస్ట్రీకొచ్చి విజయవంతంగా 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్.. “ఈ రోజుతో నా సోదరుడు ఇండస్ట్రీకొచ్చి 50 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఆయనతో కలిసి 55 సినిమాలలో నటించినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇంకా ఎన్నో గొప్ప చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను”. అంటూ మమ్ముట్టికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగానే మమ్ముట్టికి సౌత్ సినిమా ఇండస్ట్రీలో పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.ఏ భాషలో నటించినా, తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం మమ్ముట్టి ప్రత్యేకత. తనకు ఆ భాష రాకపోయినా నేర్చుకుని చెబుతుంటారు. ఆయన తనయుడు దుల్కర్ కూడా ఈ విషయం లో తండ్రి మార్గాన్ని ఫాలో అవుతుంటారు.































