సాధారణంగా ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ లో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువనే సంగతి తెలిసిందే. కరోనా వైరస్, లాక్ డౌన్ దేశంలో నిరుద్యోగుల సంఖ్యను మరింత పెరగడానికి కారణమైంది. ఇలాంటి సమయంలో దేశంలోని నిరుద్యోగులు కొత్త ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా యూపీఎస్సీ నుంచి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ప్రతి సంవత్సరం ఈ ఉద్యోగాలకు యూపీఎస్సీ నుంచి రెండుసార్లు నోటిఫికేషన్లు విడుదలవుతాయి.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఏకంగా 345 ఉద్యోగాల భర్తీ జరగనుంది. నేవీ, మిలిటరీ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులు ఈ పరీక్ష ద్వారా భర్తీ అవుతాయి. డిగ్రీ పూర్తి చేసిన 25 సంవత్సరాలలోపు వయస్సు వాళ్లు ఈ ఉద్యోగానికి అర్హులవుతారు. ఈ ఉద్యోగాల ద్వారా భారీ మొత్తంలో వేతనం పొందడంతో పాటు దేశ సేవలో భాగస్వాములయ్యే అవకాశం కూడా లభిస్తుంది. మంచి హోదాతో పాటు ఈ ఉద్యోగం ద్వారా గౌరవం కూడా లభిస్తుంది.
పెళ్లి కాని అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. :https://upsconline.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన కేటగిరీల అభ్యర్థులు మాత్రం 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు రాత పరీక్షతో పాటు ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ, వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.































