ఓకే ఊరిలో 600 మందికి కరోనా పాజిటివ్.. ఊరు ఖాళీ చేసిన గ్రామస్తులు.. ఎక్కడున్నారంటే?

0
562

దేశవ్యాప్తంగా కరోనా ఏ విధమైనటువంటి ప్రళయం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. కరోనా వైరస్ రోజురోజుకు వ్యాప్తి చెందడంతో ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. తాజాగా ఈ కరోనా రక్కసికి ఒక ఊరు మొత్తం ఖాళీ చేసే పరిస్థితి తీసుకు వచ్చింది. వికారాబాద్ జిల్లా ఎర్రవల్లి గ్రామంలో ఒకేసారి ఆరు వందల మంది కరోనా బారిన పడటంతో ప్రజలు ఎంతో భయాందోళన చెంది ఊరు మొత్తం ఖాళీ చేశారు.

ఎర్రవల్లి గ్రామంలో 1400మంది జనాభా ఉండగా అందులో 600 మంది కరోనా బారిన పడడంతో ప్రజలు ఎంతో ఆందోళన చెందుతున్నారు.ఈ క్రమంలోనే ఎప్పుడూ ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి అన్న భయంతో ఆ గ్రామంలోని గ్రామస్థులందరూ ఊరు ఖాళీ చేసి తమ పొలాలలో గుడిసెలు వేసుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ విధంగా ఊరు మొత్తం ఖాళీ చేయడంతో గ్రామ వీధిలు నిర్మానుష్యంగా మారాయి.

వారం రోజుల క్రితం ఇద్దరు కరోనా బాధితులు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడి ప్రాణాలు కోల్పోవడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ విధంగా ఊరు మొత్తం ఖాళీ చేసినప్పటికీ అధికారులు ఏ మాత్రం స్పందించలేదు. గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి అందరికీ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ని కోరినప్పటికీ అధికారులు ఏవిధమైన చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ గ్రామానికి ప్రతి రోజు ఒక ఏఎన్ఎం వస్తుందని గ్రామస్తులు తెలిపారు.కరోనాతో చనిపోయిన ఇద్దరు మృతదేహాలను జెసిబి సహాయంతో గోతులు తవ్వి పాతి పెట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే ఎప్పుడూ ఎవరికీ ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయనే ఆందోళనలో గ్రామస్తులు గడుపుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.