ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గడిచిన కొన్ని నెలల నుంచి చిగురుటాకులా వణికిస్తోంది. భారత్ లో అడ్డూఅదుపు లేకుండా వైరస్ వ్యాప్తి చెందుతోంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఒక్కో దేశంలో ఒక్కో తరహా నిబంధనలు అమలులో ఉన్నాయి. పలు దేశాల్లో కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లకు లక్షల్లో జరిమానా విధిస్తున్నారు. కొన్ని దేశాల్లో ఇప్పటికే కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమైంది.

దీంతో ప్రభుత్వాలు నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయడానికి సిద్ధమయ్యాయి. తాజాగా బ్రిటన్ లో ఐసోలేషన్ లో ఉండాల్సిన వృద్ధుడు నిబంధనలు బ్రేక్ చేయడంతో అధికారులు అతనికి ఏకంగా 4.74 లక్షల రూపాయల జరిమానా విధించారు. అంత భారీ మొత్తం జరిమానా చెల్లించిన ఆ వ్యక్తి పేరు హెన్రీ మెక్‌కార్తీ. నిబంధనల ప్రకారం ఐసోలేషన్ లో ఉన్న హెన్రీని ప్రతిరోజూ అధికారులు ఇంటికి వెళ్లి ఉన్నాడో లేదో చెక్ చేసేవారు.
అయితే ఒకరోజు తనిఖీల కోసం వెళ్లిన సమయంలో అధికారులకు ఆ వ్యక్తి కనిపించలేదు. దీంతో అధికారులు పోలీసులకు హెన్రీ ఎక్కడ ఉన్నాడో గుర్తించాలని ఆదేశించారు. పోలీసులు హెన్రీని క్రాబి జాక్ అనే పబ్ దగ్గర గుర్తించారు. కార్ నంబర్ సహాయంతో పోలీసులు అతనిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులు అతనిని జడ్జి ముందు హాజరుపరచగా కొత్త చట్టం ప్రకారం అతను 4.74 లక్షల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది.
హెన్రీ తరపు లాయర్ తన క్లైంట్ పబ్‌లో భౌతిక దూరం పాటిస్తున్నాడని వాదించినా ఫలితం లేకుండా పోయింది. న్యాయమూర్తి గ్రేమ్ మెక్కెరెల్ ఐసోలేషన్ లో లేకుండా బయటకు వెళ్లడమంటే నిబంధనలు ఉల్లంఘించటమేనని.. హెన్రీ నిబంధనలు ఉల్లంఘించిన తరువాత వాదనలు అనవసరమని పేర్కొన్నారు.
































