టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కుటుంబం, సినిమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, రాజకీయాలపై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా తన భార్య మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని వెల్లడించడం ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

రాజకీయాలపై ప్రశ్నించగా మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మేము పుట్టినప్పటి నుంచే రాజకీయ వాతావరణంలో పెరిగాం. కొత్తగా రాజకీయాల్లోకి రావడం అనే మాటే లేదు. వచ్చే ఎన్నికల్లో నా భార్య మౌనిక తప్పకుండా పోటీ చేస్తారు” అని తెలిపారు. అయితే ఏ పార్టీ తరఫున లేదా ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
ఈ సందర్భంగా ఆయన స్థాపించిన ‘ఐక్య ధైర్య సేనా సమితి’ గురించి కూడా వివరించారు. సమాజంలో గొంతు లేని వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల పేర్లలోని పదాలను కలిపి ఈ పేరును నిర్ణయించామని తెలిపారు. ఇది కేవలం సేవా కార్యక్రమాల కోసం మాత్రమేనని, రాజకీయ లక్ష్యాలతో ప్రారంభించలేదని స్పష్టం చేశారు.
తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. ఇప్పటికీ ప్రతి కథను స్వయంగా విని నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం విభిన్నమైన కథలపై దృష్టి పెట్టానని, వరుసగా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నానని వెల్లడించారు. జూన్ 7న ప్రారంభమయ్యే ‘రక్షక్’ సినిమాలో మహిళా భద్రతకు సంబంధించిన బలమైన కథ ఉంటుందని తెలిపారు. ఈ చిత్రంలో తాను పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నట్లు చెప్పారు.
ఇక కొత్త ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ‘డేవిడ్ రెడ్డి’ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోందని, త్వరలో గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. అలాగే ‘మోహన రాగ మ్యూజిక్’ పేరుతో సంగీత ప్రాజెక్ట్ కూడా రూపొందుతోందని తెలిపారు. మరోవైపు మౌనిక నిర్వహిస్తున్న ‘నమస్తే వరల్డ్’ టాయ్స్ సంస్థను త్వరలో ఇతర నగరాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని వెల్లడించారు.
సినిమాలతో పాటు సామాజిక అంశాలపై కూడా చురుకుగా స్పందిస్తున్న మంచు మనోజ్.. మౌనిక రాజకీయ ఎంట్రీపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.



























