ప్రకృతిలో అత్యంత శక్తి వంతమైనవి ఐదు. వాటినే మనం పంచభూతాలు అంటాం. అందులో అత్యంత శక్తివంతమైనది నీరు. పెద్ద పెద్ద తుఫానులు, వరదలు వచ్చిన సందర్భంలో నీళ్లు స్పష్టించే భయానక దృశ్యాలు చూస్తే కాళ్లు గజగజ వణికిపోతాయి. తాజాగా అలాంటి షాకింగ్ దృశ్యాలే కెమెరాలో రికార్డు అయ్యాయి. సముద్రంలో నీటి మట్టం పెరగడంతో తీరంలో ఉన్న రెండంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటన అర్జెంటీనా రాజధాని బ్యునోస్ ఎయిర్స్‌లో వెలుగుచూసింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. మార్ డెల్ తుయు సిటీలోని దక్షిణ అట్లాంటిక్ మహాసముద్ర తీరాన అర్జెంటీనా ప్రజలు ఇళ్ళు నిర్మించుకున్నారు. వాటిలో ఒక రెండు అంతస్తుల భవనాన్ని తీరంలోని చిన్న కొండపై నిర్మించారు. అయితే జులై 28న అట్లాంటిక్ మహాసముద్రం ఉగ్రరూపం దాల్చింది.
సముద్రంలో ఎగిసిపడిన అలలతో తీరానికి ఆనుకొని ఉన్న ఇంటి ఫౌండేషన్ దెబ్బతిన్న కారణంగా రెండంతస్తుల భవనం సముద్రంలో కుప్పకూలిపోయింది. భవనం కూలిపోతున్న దృశ్యాలను ఓ స్థానికుడు తన కెమెరాలో బంధించాడు. అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో సినిమాలోని సన్నివేశం కంటే అత్యంత భయానకంగా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ ఒక్క ఘటన వల్ల చాలా ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.
అయితే ఈ ఒక్క ఘటనమే మాత్రమే కాదు.. తీర ప్రాంతం కోతకు గురవుతున్న క్రమంలో ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. కాగా సంఘటన జరిగిన సమయంలో యజమానులు ఇంట్లో లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోలేదు. ఏది ఏమైనా సముద్రాల తీరం వెంబడి నివాసం ఎప్పకికైనా ప్రమాదమే.



























