సాధారణంగా మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎన్నో వాహనాలు ప్రమాదానికి గురవుతుండటంతో మనం చూస్తూ ఉంటాము. ఇలాంటి ప్రమాదాలు అనేక కారణాల వల్ల జరుగుతుంటాయి.ఇందులో రోడ్లపై ఏర్పడిన గుంతలు కారణంగా ఎంతోమంది ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం.

రహదారులపై ఏర్పడిన ఇలాంటి గుంతల కారణంగా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నప్పటికీ అధికారులు మాత్రం నెలకు వేలు వేలు జీతాలు తీసుకుంటూ ఏమాత్రం చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే హైదరాబాద్ కి చెందిన వృద్ధ దంపతులు కట్నం గంగాధర్ తిలక్, అతని భార్య వెంకటేశ్వరి రోడ్డు పై జరుగుతున్న ప్రమాదాలను చూసి చలించిపోయారు. ఈ క్రమంలోనే ఈ రోడ్డు వల్ల మరొక వ్యక్తి మరణించకూడదన్న ఉద్దేశంతో మానవత దృక్పథంతో ఒక గొప్ప కార్యాచరణకు నడుంబిగించారు.
ఈ క్రమంలోనే ఈ వృద్ధ దంపతులు వారికి వచ్చే పింఛను డబ్బులు ఖర్చు చేసి రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చడం మొదలుపెట్టారు. 2010 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 2030 గుంతలను పూడ్చినట్లు ఈ దంపతులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం ఓ కారులో రోడ్ బ్రాండ్ మెటీరియల్ తీసుకొని బయలుదేరుతారు. ఎక్కడైతే రోడ్లపై విరిగి గుంతలు కనిపిస్తాయో అక్కడ కారు ఆపి ఆ గుంతలను మరమ్మతు చేస్తారు ఈ విధంగా వీరు ఆ కారుకి పాత్ హోల్ అంబులెన్స్ అనే పేరును కూడా పెట్టుకున్నారు. ఒక్కో గుంతను మరమ్మతు చేయాలంటే ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతాయని ఈ దంపతులు తెలిపారు.
ఈ విధంగా వృద్ధ దంపతులు సమాజం కోసం చేస్తున్నటువంటి ఈ సేవ గురించి ఓ పత్రికలో కథనం రావడంతో దీనిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్లో రోడ్లు గుంతలు పడుతుంటే జిహెచ్ఎంసి అధికారులు ఏం చేస్తున్నారు? జిహెచ్ఎంసి అధికారులకు జీతాలు ఇవ్వడం దండగ? వీరికి ఇవ్వాల్సిన జీతాలు ఆ వృద్ద దంపతులకు ఇస్తే సరిపోతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కోర్టుకు సమగ్ర నివేదిక ఇవ్వాలని హైకోర్టు జిహెచ్ఎంసి అధికారులకు ఆదేశించింది. అదేవిధంగా వీరు చేస్తున్నటువంటి సేవలకు దేశం నలమూలల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఈ దంపతులను ప్రశంసిస్తూ వీరికి కారును బహుమతిగా ఇచ్చాడు.