కరోనా కారణంగా ఒక్క రంగంలోనే కాదు.. ప్రతీ విభాగం నష్టపోయింది. ఆర్థిక రంగం దగ్గర నుంచి పర్యాటక రంగం వరకు అన్నిటింకీ నష్టాలు తప్పలేదు. ఈ కోవలోకే ప్రయాణాలకు సంబంధించిన విభాగాల్లో కూడా నష్టం తప్పలేదు. లాక్ డౌన్ కాలంలో ఇంటి దగ్గరే ఉండటంతో వాహనరంగం కూడా కుదేలైంది. ముఖ్యంగా విమాన రంగాన్ని కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బ తీసింది.

అయినా కానీ ప్రముఖ ప్రైవేటు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ప్రయాణికులకు బంపర్ ఆఫర్ తో ముందుకొచ్చింది. ఈ సంస్థ డొమెస్టిక్ టికెట్ ధరలపై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఫ్లాష్ సేల్ పేరుతో ఈ ఆఫర్ను ప్రారంభించింది. సేల్లో భాగంగా విమాన టికెట్లను రూ. 914 ప్రారంభ ధరతో అందిస్తోంది. అయితే దేశీయ ప్రయాణానికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్ ఏషియా స్పష్టం చేసింది.
అయితే ఇవి కేవలం 2021 సెప్టెంబర్ 1 నుంచి 2022 మార్చి 26 మధ్య ప్రయాణానికి మాత్రమే. వీటికి ఆగస్టు 4 నుంచి ఆగస్టు 6 మధ్య అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే అంటూ ప్రకటించారు. ఇంఫాల్ నుంచి కోల్‌కతా, ఇంఫాల్ నుంచి గౌహతి మార్గాల మధ్య ప్రయాణానికి అతి తక్కువగా రూ. 914కే టికెట్ ఆఫర్ చేస్తుండటం విశేషం.
వచ్చే మూడు నెలల్లో దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలు ఉండటంతో దాదాపు 70 శాతం మంది ముందస్తు ప్రయాణాలకు సిద్ధమవుతున్నారని ఎయిర్ ఏషియా సర్వేలో తేలింది. వారి ప్రయాణానికి ఉపయోగపడేలా ఈ ఫ్లాష్ సేల్ ఆఫర్ను తీసుకొచ్చింది. 2021 జులైలో ఎయిర్ ఏషియా ఇండియా, ట్రావెల్ ఇంటెంట్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారంగా ఈ ఆఫర్లను ప్రకటించింది.

































