ఆమె పాట పాడితే మనసు పులకరించి పోతుంది.. ఎలాంటి బాధలో ఉన్న ఉపశమనం కలుగుతుంది. అద్భుతమైన గాత్రంతో తీయనైన పాటలు పాడి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న గాయని, చిత్ర గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు అన్ని భాషలలో సుమారు 20 వేలకు పైగా పాటలు పాడి ఎంతోమందిని ఆకట్టుకున్న చిత్రమ్మ గారు తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన జీవితంలో జరిగిన కొన్ని ఆశక్తికరమైన ఘటనలను గురించి ముచ్చటించారు.

ఆలీతో సరదాగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిత్ర గారికి అలీ గులాబి పువ్వులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన సినీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను గురించి ముచ్చటించారు. ఈ క్రమంలోనే అలీ కె ఎస్ చిత్ర అంటే పూర్తి పేరు ఏంటని అడగగా.. కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర అని తన అసలు పేరును ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ మధ్యకాలంలో తెలుగు రాయడం, చదవటం నేర్చుకున్నారటగా అని అడగగా.. అందుకు చిత్ర సమాధానం చెబుతూ ఇప్పుడు కాదు ఎప్పటినుంచో తెలుగు నేర్చుకుంటున్నాను. అసలు నాకు తెలుగు అక్షరాలను రాసిచ్చింది బాలు గారు. ఇద్దరం కలిసి ఎన్నో పాటలు పాడాము. ఈక్రమంలో ఏవైనా సందేహాలు వచ్చినప్పుడు ఆ సందేహాలను తీర్చేవారు. బాలు గారితో కలిసి ఉండటం వల్లే నాకు తెలుగు వచ్చిందని ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం తన జీవితం ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన వారిలో మొదటి బాలు గారు, జేసుదాసు గారి పాత్ర ఎంతో ఉందని ఈ సందర్భంగా చిత్ర గారు తెలియజేశారు. జేసుదాసు గారిని ఎంతో ప్రేమగా దాసన్న అని పిలిచే దానినని చిత్ర ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర తన వ్యక్తిగత విషయాలను కూడా ఈ సందర్భంగా అలీతో పంచుకున్నారు.

































