Flash Back : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో మహేష్ బాబు ప్రభాస్ అల్లు అర్జున్ వంటి వారు ప్రథమ స్థానంలో ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతంతో పోలిస్తే గతంలో ప్రభాస్, మహేష్ బాబు కన్నా అల్లు అర్జున్ కు తక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఈ క్రమంలోనే ఈయన సినిమాలు అన్ని విధాల బాగుంటేనే ప్రేక్షకులు అల్లు అర్జున్ సినిమాలను ఆదరించేవారు.

అయితే ప్రభాస్ మహేష్ బాబు సినిమాలు అలా కాదు వీరి సినిమాలకి మీడియం రేంజ్ టాక్ వచ్చిన అద్భుతమైన కలెక్షన్లను రాబట్టేవి. ఈ క్రమంలోనే 2004 వ సంవత్సరం సమ్మర్ బరిలో ఈ ముగ్గురు హీరోల సినిమాలు పోటీకి దిగాయి. అయితే అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమా తుఫానులో మహేష్ బాబు ప్రభాస్ నటించిన సినిమాలు కొట్టుకుపోయాయి.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఆర్య. ఈ సినిమా 2004 మే 7వ తేదీ విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా అతి తక్కువ థియేటర్లలో విడుదలయినప్పటికీ మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైన వారానికి అనగా మే 14 వ తేదీ “నాని” సినిమా విడుదలయ్యి మొదటి షో తోనే డిజాస్టర్ సొంతం చేసుకోవడంతో కొన్ని థియేటర్స్ ఈ సినిమాని తొలగించి ఆర్య సినిమాను ప్రదర్శించడం గమనార్హం.
సూపర్ హిట్ గా నిలిచిన ఆర్య…
ఇక ఈ రెండు సినిమాలు విడుదలైన తర్వాత ప్రభాస్ నటించిన “అడవి రాముడు” చిత్రాన్ని మే 21వ తేదీ విడుదల చేశారు. అప్పటికే వర్షం వంటి సూపర్ హిట్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రభాస్ నటించిన అడవి రాముడు సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. అయితే కొన్ని థియేటర్లలో 50 రోజుల వరకు ప్రదర్శితమైన అడవి రాముడు సినిమా ఆర్య సినిమా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.































