Allu Ramalingaiah : ఆయన హాస్యం మూడు తరాల ప్రేక్షకులను అలరించింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టిన అల్లురామలింగయ్యకు చిన్నప్పుడు చదవు పెద్దగా అబ్బలేదు. తోటి మిత్రలతో తిరుగుతూ వారిని నవ్విస్తూ కాలం గడిపేవారు. కొద్ది కాలం తరువాత నాటకాల్లో నటించాలన్న ఆసక్తి కలిగింది. దీంతో ఊర్లోకి నాటకాల వారు వచ్చిన ప్రతి సారీ వారి వెంట తిరుగుతూ వారితే స్నేహం చేస్తూ ఏదో ఒక చిన్న వేషం ఇవ్వమని అడిగేవారట. ఆయన ఆసక్తిని మెచ్చిన వారు చిన్న అవకాశం ఇవ్వడం అలా తనకు వచ్చిరాని నటనతో మెప్పించడంతో తన నట జీవితాన్ని నాటకాలతో ప్రారంభించారు అల్లు రామలింగయ్య.

అప్పట్లో ఓ వైపు నాటకాల్లో పాల్గొంటూనే గాంధీజి పిలుపుతో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. అక్కడ కూడా సమయాన్ని వృధా చేయలేదు. తోటి వారిని ఏకం చేసి నాటకాలను ప్రదర్శించేవారు. జైలు నుంచి విడుదలైన తరువాత కూడా నాటకాలపైనే ఆసక్తి ఉండేది రామలింగయ్య గారికి అలా ఓ సారి గరికపాటి రాజారావు అల్లు రామలింగయ్య నటనను చూసి సినిమాల్లో తొలిసారిగా అవకాశం ఇచ్చారు. 1952 లో విడుదలైన పుట్టిల్లు చిత్రంలో మొదటి సారిగా నటించారు. ఆ తరువాత వద్దంటే డబ్బు, మూగమనసులు, దొంగరాముడు, మాయాబజార్, ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, అందాలరాముడు, శంకరాభరణం ఇలా ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన హాస్యంతో అలరించారు అల్లు రామలింగయ్య.

కొన్ని కొన్ని సినిమాల్లో కామెడీకి కాస్తంత విలనిజాన్ని కలగలిపి పోషించిన పాత్రలు సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవి. చిత్ర పరిశ్రమలో గాడ్ ఫాదర్‌లు , సపోర్ట్ చేసే వారు ఎవరూ లేకపోయినా కేవలం తన నటన, మనోధైర్యంతో ముందుకు సాగుతూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలా సుమారు వెయ్యికిపైగా సినిమాల్లో కామెడీ విలన్ పాత్రలను పోషించారు అల్లు. అప్పట్లో కొన్ని పాటల్లోనూ తన విభిన్నమైన శైలితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా అనే పాటే అప్పట్లోనే కాదు ఇప్పటికీ ట్రెండీ సాంగ్ గానే హిట్ లిస్ట్ లో ఉంది. 90లలోనూ ఆయన అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తాను నవ్వుతూ తోటి వారిని నవ్విస్తూ 50 ఏళ్లు సినీ ఇండస్ట్రీలో కొనసాగిన ఈ సినీ దిగ్గజానికి ఎన్నో అవార్డులు, పురస్కారాలు సొంతమయ్యాయి. మాయాబజార్ సినిమాల్లో అల్లు రామలింగయ్య నటించిన హాస్య సన్నివేశాలు ఇప్పటికీ ఎంతోగానో అలరిస్తాయి.
Allu Ramalingaiah : ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన అల్లు రామలింగయ్య

అల్లు రామలింగయ్య నిర్మాతగానూ గీతా ఆర్ట్స్ బానెర్ పైన అనేక చిత్రాలను నిర్మించారు. అవన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద దాదాపు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక అప్పటి స్టార్ హీరో చిరంజీవి ని తన అల్లుడిని చేసుకున్నారు అల్లు రామలింగయ్య. ఆ తరువాత చిరు నటించిన అల్లుడా మజాకా, ముఠామేస్త్రీ, ఆ ఒక్కటి అడక్కు, మెకానిక్ అల్లుడు, ఆపద్భాందవుడు, పెద్దరికం, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, రాజా విక్రమార్క, కొదమ సింహం, జగదేకవీరుడు అతిలోక సుందరి, కొండవీటి దొగ, ఖైదీ నెం.786, ఆకరి పోరాటం వంటి చాలా వరకు సినిమాల్లో తన హాస్యంతో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల జల్లు కురిపించారు. దేవుళ్లు, మావిచిరుగు సినిమాల్లోనూ చివరి దశకు చేరుకున్నా…తన హాస్యాన్ని అందరికీ పంచిన గొప్ప కళాకారుడు. ఆయన మాటలు మాట్లాడే శౌలీ, కామెడీ పంచ్ లు ఇప్పటికీ ప్రేక్షకుల నవ్వులో నిలిచిపోయాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
































