అడవుల అందాలతో పేరుగాంచిన ఆదిలాబాద్ జిల్లాలో వేసవి వచ్చిందంటే ఒక ప్రత్యేకమైన పండుకు డిమాండ్ పెరుగుతుంది. అదే తునికి పండు. స్థానికంగా “అమర్ ఫలం”గా పిలిచే ఈ పండు అక్కడి గిరిజనుల ఆహారంలో ముఖ్య స్థానం సంపాదించింది. చిన్న పరిమాణంలో ఉండే ఈ పండు బయట గట్టిగా కనిపించినా, లోపల నాజూగ్గా, తియ్యటి-వగరు కలగలిసిన రుచితో ప్రత్యేకంగా ఉంటుంది.

ఈ పండు సంవత్సరంలో కొద్దికాలం మాత్రమే లభిస్తుంది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో అడవుల్లో విస్తారంగా కనిపిస్తుంది. ఉదయం వేళల్లోనే గిరిజనులు అడవుల్లోకి వెళ్లి వీటిని సేకరించడం వారి జీవనశైలిలో భాగమైంది. మార్కెట్లో అరుదుగా దొరికే ఈ పండుకు స్థానికంగా మంచి డిమాండ్ ఉంది.
ఆరోగ్య పరంగా కూడా తునికి పండుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇందులో విటమిన్ A, C వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు, రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో కూడా సహాయపడుతుంది. పొటాషియం ఎక్కువగా ఉండటంతో రక్తపోటు నియంత్రణకు ఉపయోగకరమని వైద్యులు సూచిస్తున్నారు.
ఇలా రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ పండు స్థానిక ప్రజలకు ప్రత్యేకమైన సంపదగా మారింది. సహజసిద్ధంగా లభించే ఈ ఫలాన్ని ఒకసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు.































