ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు నవరత్నాల అమలులో భాగంగా అమ్మఒడి స్కీమ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ గతేడాది జనవరి నెల 9వ తేదీన అమ్మఒడి స్కీమ్ లో భాగంగా 15,000 రుపాయలు విద్యార్థుల తల్లుల ఖాతాలలో జమ చేసింది. ఈ ఏడాది 14,000 రూపాయలు ప్రభుత్వం నుంచి విద్యార్థుల తల్లుల ఖాతాలలో జమైంది.. నేడు జగన్ సర్కార్ ఆ మొత్తాన్ని జమ చేసింది.

అయితే సీఎం జగన్ నేడు అమ్మఒడి స్కీమ్ అమలు కార్యక్రమంలో మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి అమ్మఒడి స్కీమ్ డబ్బులు వద్దని అనుకునే వాళ్లు ల్యాప్ ట్యాప్ ను తీసుకోవచ్చని జగన్ కీలక ప్రకటన చేశారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ చదివే వసతి దీవెన లబ్ధిదారులు ల్యాప్ టాప్ లను పొందే అవకాశం ఉంటుంది. నెల్లూరు జిల్లాలో రెండో విడత చెల్లింపులను ప్రారంభించిన జగన్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు అమ్మఒడి స్కీమ్ ను అమలు చేస్తున్నామని.. తమ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. చదువుకునే వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ బడికి వెళ్లాలని.. పేదింటి పిల్లలకు మేనమామలా వాళ్లు చదువుకు దూరం కాకుండా ఆదుకుంటానని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల గురించి కూడా సీఎం జగన్ స్పందించారు.

తమ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని.. ఆలయ భూములను కాజేసిన వాళ్లు, గుడుల్లో క్షుద్రపూజలు చేసిన వాళ్లు ఇప్పుడు కొత్త వేషాలు కడుతున్నారని జగన్ అన్నారు. ప్రజలు అసత్య ప్రచారాలు చేసే వాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here