కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఇంట్లో ఒకరికి తప్పనిసరిగా కరోనా టెస్ట్ జరపాలని నిర్ణయించింది. ఆర్ధికంగా కొంచెం భారం అయినప్పటికి ప్రస్తుత పరిస్థితుల దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిరోజూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ టెస్టులు చేస్తున్న దేశాలు కరోనా కట్టడిలో మంచి ఫలితాలు అందుకుంటున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ సీఎం జగన్ ప్రతి ఇంట్లో ఒకరికి టెస్ట్ తప్పనిసరిగా జరపాలని ఆదేశించారు.

అయితే ముందుగా రెడ్ జోన్ లో ఉన్న మండలాల్లో కరోనా టెస్టులు చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ముందుగా రెడ్ జోన్లలో ఉన్న జిల్లాలు కర్నూలు, గుంటూరు, ప్రకాశం, కృష్ణ, నెల్లూరు, చిత్తూరులో ప్రతి ఇంట్లో ఒకరిని తీసుకెళ్లి కరోనా టెస్టులు జరిపించనున్నారు. ఈ టెస్టుల్లో ఎవరికైనా పాజిటివ్ వస్తే వెంటనే ఆ వ్యక్తి ఉంటున్న ఇంట్లో మరియు చుట్టుపక్కల వారికీ కూడా టెస్టులు జరిపిస్తారు. శనివారం ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు మండలంలో ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా టెస్టులు జరిపారు. గ్రామ వాలంటీర్లు తమ పరిధిలోని 50 కుటుంబాలలో ఒకరిని తీసుకెళ్లి పరీక్షలు జరిపించారు. అయితే ఈ టెస్టుల ఫలితాలు మాత్రం రెండు రోజుల్లో రానున్నాయి.
































