ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి. గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ నటి ఖుష్బూ భర్తగా తెలుగు వారికి సుపరిచితమే.. అంతే కాకుండా ‘చంద్రకళ’ ,‘కళావతి’ సినిమాల్లో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘అరణ్మనై’ సినిమాను చంద్రకళ పేరుతో తెలుగులోకి అనువదించారు.

ఇది ఇక్కడ కూడా హిట్ సాధించింది. ‘అరణ్మనై-2’ సినిమాను కళావతి పేరుతో డబ్బింగ్ చేశారు.ఈ రెండు సినిమాలు కూడా తెలుగులో మంచి హిట్ సాధించాయి. ముఖ్యంగా హర్రర్, కామెడీ సినిమాను తీయడంలో సుందర్ సి. దిట్ట. ఇంతకుముందు తెలుగులోకి వచ్చినవి కూడా ఇదే తరహాకు చెందినవి. సుందర్ డైరెక్ట్ చేసే సినిమాలు మినిమం గ్యారెంటీ అని తెలుగు ఆడియన్స్ కు తెలుసు.
ప్రస్తుతం మరో హర్రర్, కామెడీ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు. ‘అంత:పురం’ పేరుతో మరో సినిమా తెలుగు ఆడియన్స్ ముందుకు రానుంది. తాజాగా అరణ్మనై-3 సినిమాను కూడా తెలుగులోకి డబ్బింగ్ చేసేందుకు సిద్దమవుతున్నారు.
ఇటీవల విడుదలైన ఈసినిమాను ‘అంత:పురం’ పేరుతో అనువదించనున్నారు. ఆర్య, రాశిఖన్నా, ఆండ్రియా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను డిసెంబర్ 31న తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఈ హారర్ కామెడీ చిత్రంలో సాక్షి అగర్వాల్, స్వర్గీయ వివేక్, మైనా నందిని, యోగి బాబు, నళిని, మనోబాల, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సి. సత్య సంగీతాన్ని అందించారు. సుందర్ సి భార్య కుష్బూ ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది.






























