ప్రస్తుత కాలంలో కూతురు పడుతుందని తెలియగానే ఎంతో బరువుగా భావించి వారిని పొత్తిళ్లలోనే పరలోకానికి పంపుతున్నారు. మరికొందరికి ముళ్ళ పొదలు, చెత్త కుండీలు ఆశ్రయంగా మారాయి.ప్రపంచం రోజురోజుకు అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొందరిలో ఆడపిల్లల పట్ల ఉన్న ఈ విధమైనటువంటి భావన మాత్రం మారడం లేదు. ప్రతిరోజు ఆడపిల్లల పట్ల వివక్షత చూపిస్తున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాము. ఇలాంటి సందర్భంలోనే ఓ వ్యక్తి తన కూతురు పుట్టిందని అతడు చేసిన పనికి గ్రామం మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతకీ అతను ఏం చేశాడంటే..

సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం ఖానాపూర్ లో మరబోయిన నవీన్‌కు శనివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.అయితే తన కూతురు పుట్టిందని ఏమాత్రం కృంగిపోకుండా తనకు మహాలక్ష్మి పుట్టిందని సంబరపడిపోయాడు.ఈ క్రమంలోని తన కూతురు పుట్టిన విషయాన్ని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. ఈ సందర్భంలోనే తనకు కూతురు పుట్టిన సంతోషాన్ని ఊరందరికీ నాలుగైదు రోజులకు సరిపడే కూరగాయలను ప్రతి ఇంటికీ పంచి తన ఆనందాన్ని పంచుకొని వేడుకగా జరుపుకున్నారు.
గ్రామంలోని 300 ఇండ్లకు కూరగాయలను పంచుతూ తన కూతురు పుట్టిందని, తన ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని నవీన్ ఎంతో గర్వంగా చెప్పుకున్నాడు. ఈ విధంగా తనకు కూతురు పుట్టిన సందర్భంగా గ్రామం మొత్తానికి కూరగాయలు పంచడంతో గ్రామస్తులందరూ అతనిని ప్రశంసలతో ముంచెత్తారు. స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకునే ఈ రోజుల్లో ఈ విధంగా గ్రామస్తులు అందరికీ సహాయం చేయడంతో గ్రామస్తులు అతనిని పొగడ్తలతో ముంచెత్తారు.
ప్రస్తుతం ఉన్న కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి ఈ విధంగా తన మిత్రుల సహాయంతో కూరగాయలు పంచడం తనకెంతో ఆనందంగా ఉందని ఈ విధంగా గ్రామస్తులు అందరికీ సేవచేసే అదృష్టం రావడం ఎంతో సంతోషంగా ఉందని నవీన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.































