కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు స్కీమ్స్‌ను ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్స్, ఉద్యోగులు, మహిళలు, మధ్యతరగతి, పేదలు ఇలా ప్రతి వర్గానికి ప్రయోజనం కలిగేలా పథకాలు అందిస్తోంది. సమాజంలో పేదవారి సామాజిక ఆర్థిక భద్రత కోసం కేంద్రం ఇన్సూరెన్స్ స్కీమ్స్‌లతో పాటు అంసంఘటిత రంగంలో పనిచేసే వారిని పెన్షన్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

ఇన్సెరెన్స్ పథకాల్లో ముఖ్యంగా.. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు ప్రధాన మంత్రి అటల్ పెన్షన్ యోజన పథకాలను 2015 సంవత్సరంలో ఒక్కరోజే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిలో ఇప్పుడు మనం చెప్పుకునే స్కీమ్.. అటల్ పెన్షన్ యోజన పథకం. అసంఘటిత రంగంలో పని చేసే ప్రతీ ఒక్కరు ఇందులో జాయిన్ అవ్వోచ్చు.
దీనికి 18 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సున్న వారు అర్హులుగా పేర్కొన్నారు. అయితే దీనిలో 18 ఏళ్ల వయస్సులో జాయిన్ అయిన వారు నెలకు రూ.210 జమ చేయాల్సి ఉంటుంది. అంటే రోజుకు రూ.7 పొదపు చేసుకుంటే.. 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత నెలకు రూ.5000 పెన్షన్ కింద తీసుకునే అవకాశాన్ని కల్పించారు. ఒక వేల నెలకు రూ.168 జమ చేసినట్లయితే రూ.4000 పెన్షన్ పొందొచ్చు.
కేవలం రూ.1000 పెన్షన్ కావాలనుకునే వారు నెలకు రూ. 42 చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఇది కేవలం18 ఏళ్ల వయస్సు ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. 18 ఏళ్ల నుంచి వయస్సు పెరుగుతున్నా కొద్ది.. నెలకు జమ చేసే ప్రీమియం మారుతూ ఉంటుందని గమనించాలి. దీనిలో జాయిన్ అయ్యే వారు తమ బ్యాంక్ ఖాతా ఉన్న బ్రాంచ్ ను సంప్రదించాల్సి ఉంటుంది. లేదా నెట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.































