RRR Movie: గత నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో ఆశగా, ఆత్రుతగా ఎదురు చూస్తున్న సమయం మరి కొద్ది రోజులలో రానుందని తెలియడంతో ఎంతో మంది సినీ ప్రేమికులు, తారక్ అభిమానులు, చెర్రీ అభిమానులు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూశారు. అయితే ఈ సినిమా ఎలాంటి పరిస్థితిలోనైనా జనవరి 7వ తేదీ విడుదల చేస్తామని ప్రకటించిన దర్శకుడు రాజమౌళి ఈ సినిమా విడుదల విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

నూతన సంవత్సరం కానుకగా అభిమానులకు జక్కన్న చేదు వార్తను చెప్పబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలలో పలు ఆంక్షలు విధించారు. దీంతో థియేటర్లు కూడా మూతపడే దిశగా అడుగులు వేయడంతో ఈ సినిమా విడుదల పై నిర్మాతలు మరోసారి ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వివిధ భాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. కనుక ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించడంతో ఈ సినిమా జనవరి 7వ తేదీ విడుదల కాకుండా వాయిదా పడుతున్నట్లు సమాచారం. ఈ సినిమా విడుదల వాయిదా పై నేడు ప్రకటించే అవకాశం ఉంది.
వేసవి సెలవులలో విడుదల కానున్న RRR..
ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ప్రస్తుతం ఈ సినిమా వాయిదా పడితే ఈ సినిమాను వచ్చే వేసవి సెలవుల్లో విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసినప్పటికీ ఈ సినిమా విడుదల వాయిదా వైపు అడుగులు వేస్తోందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరి నూతన సంవత్సరం కానుకగా ఈ సినిమా విడుదల పై జక్కన్న ఎలాంటి ప్రకటన చేస్తారో వేచి చూడాలి.































