1988 లో ఒకరోజు పెద్దాయన ఎన్టీఆర్ ఇంటి నుండి పిలుపు రావడంతో కోదండరామిరెడ్డి ఆలోచనలో పడ్డారు. అన్నగారి సినిమాకు పనిచేశారు గాని ఆయనను దర్శకత్వం చేసే అవకాశం తనకు రాలేదు. మళ్లీ ఆయన నటిస్తే దర్శకత్వం చేయాలని కోదండరామిరెడ్డి ఆశపడ్డారు. ఒక దశలో పెద్దాయన అందుకే ఫోన్ చేశారేమో అని కోదండరామిరెడ్డి భావించారు. ఆ తర్వాత ఒకరోజు కోదండరాంరెడ్డి మరియు పరుచూరి బ్రదర్స్ ఉదయం 5 గం.లకు అన్నగారి దగ్గరికి వెళ్లారు. ఎందుకంటే ఎన్టీఆర్ అంత ఉదయాన్నే లేచి స్నానం ఇత్యాది కార్యక్రమాలు ముగించుకొని కాసేపు దైవ సన్నిధిలో గడపడం ఆయనకు అలవాటు.

వారిద్దరూ అక్కడికి చేరుకున్న తర్వాత పరుచూరి బ్రదర్స్ చెప్పిన స్టోరీ కోదండరామిరెడ్డికి నచ్చలేదని ఎన్టీఆర్ ముందే చెప్పేశారు. అన్నగారు కూడా బాగా ఆలోచించారు. మీకు మాత్రం నచ్చనప్పుడు ఏం చేస్తాం బ్రదర్.. తరువాత కలుద్దామని పెద్దాయన అనడంతో అక్కడి నుండి పరుచూరి బ్రదర్స్ కోదండరామిరెడ్డి బయటకు వెళ్ళిపోయారు. ఏంటయ్యా పెద్దాయన ముందు అలా నచ్చలేదని చెప్తే ఆయన ఏమనుకుంటారో కాస్త ఆలోచించారా? మీరు అని కోదండతో పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. కథ బాగోలేదని అనిపించినప్పుడు అలానే చెప్తాం కానీ బాగుందని ఎలా చెప్తాం. ఆ తర్వాత సినిమా ఆడకపోతే తిరిగి మనల్ని కదా పెద్దాయన అనేది అని కోదండరామిరెడ్డి, గోపాలకృష్ణల మధ్య కాస్త సంభాషణ జరిగింది. అదే కథను ఎన్టీఆర్ వినమని చెప్పడంతో బాలయ్య కూడా విన్నారు. కానీ ఎందుకనో ఆ సినిమా బాలయ్యకు కూడా నచ్చలేదు. కానీ తండ్రిగారి మాటకు కట్టుబడి సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా బాలయ్య నటించాలనుకున్నారు.

కట్ చేస్తే……
ఎక్కడో సినిమా షూటింగ్ లో పాల్గొన్న కోదండరామిరెడ్డికి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు నుండి ఫోన్ రావడం జరిగింది. ఏం బ్రదర్ ఆ రోజు మనం విన్న కథ నాకు ఎందుకో బాగా నచ్చింది. దానిని మనం కలిసి చేద్దాం అనడంతో కోదండరామిరెడ్డికి ఏం చేయాలో అర్థం కాలేదు. పెద్దాయన చెప్పడంతో చేసేది ఏమీ లేక బాలకృష్ణ హీరోగా “తిరగబడ్డ తెలుగు బిడ్డ” సినిమాని కోదండరామిరెడ్డి పూర్తి చేశారు. సినిమా విడుదలైన తర్వాత చూస్తే బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది… కథ చెప్పినప్పుడే విజువలైజేషన్ చేసుకునే కోదండరామి రెడ్డికి ప్రేక్షకుడి నాడి ఏమిటో ముందే తెలిసిపోతుంది అనడంలో సందేహం లేదు.


































