దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. అడ్డూఅదుపు లేకుండా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి వల్ల అంచనాలకు మించి కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్, వైరస్ పై సమర్థవంతంగా పని చేసే ఔషధాలు అందుబాటులోకి వచ్చేంతవరకు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం ద్వారా మాత్రమే వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ బారిన పడకుండా ఉండాలంటే రొగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి.

ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం అనేక ప్రయోగాలు చేస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు పోషకాలు ఉండే ఆహారం తినడం వల్ల కరోనా మరణాల ముప్పును అడ్డుకోవచ్చని తెలుపుతున్నారు. గతంలో శాస్త్రవేత్తలు కరోనా మరణాల ముప్పును తగ్గించుకోవడానికి సి విటమిన్, డి విటమిన్ అవసరమని చెప్పినా వీటితో పాటు ఇతర ఆహార పదార్థాలకు కూడా ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు.
ఎవరికైతే రక్తంలో జింక్ తక్కువగా ఉంటుందో వారికి వైరస్ సోకితే ప్రాణాలు పోయే ప్రమాదం ఎక్కువగా ఉందని బార్సిలోనాలోని టెర్షరీ యూనివర్సిటీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. శరీరంలో జింక్ కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నంతో కణాల పెరుగుదల, విభజన కోసం ఉపయోగపడుతుంది. శరీరంలో జింక్ స్థాయిలు పెరగాలంటే జింక్ ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలను తీసుకుంటే సరిపోతుంది.
చిక్కుళ్లలో మనకు కావాల్సినంత జింక్ లభిస్తుంది. చిక్కుళ్లు మొలకెత్తినవి లేదా ఉడకబెట్టినవి లేదా నానబెట్టినవి తింటే మంచిది. నువ్వులు, జీడిపప్పు, గుమ్మడికాయ గింజలు కూడా జింక్ ను శరీరంలో పెంచడంలో సహాయపడతాయి. పాలు, గుడ్లు, డార్క్ చాకెట్ తీసుకోవడం వల్ల కూడా శరీరానికి కావాల్సినంత జింక్ పుష్కలంగా లభిస్తుంది.



























