బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ లో ప్రస్తుతం హౌస్ లో 16 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి.. మూడో వారంలో లహరి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే లహరి ఎలిమినేట్ అవ్వడం.. అందరినీ షాక్ కు గురిచేసింది. అసలు ఎవరూ ఊహించని రీతిలో ఆమె హౌస్ నుంచి వెళ్లిపోయింది.

దీనికి గల కారణం రవి అంటూ కూడా ఆమె పరోక్షంగా విమర్శలు కూడా చేసింది. అయితే ఆమెకు కాస్త ఆవేశం ఎక్కువగా ఉంటుందనేది తెలిసిందే. దానికి నాగార్జున కూడా చెప్పాడు. ఆవేశాన్ని తగ్గించుకోవాలమ్మా అంటే.. తను రైట్ ఉంటేనే మాట్లాడుతా సర్.. లేదంటే అస్సలు మాట్లాడను అంటూ సమాధానం కూడా చెప్పింది.

అయితే ప్రస్తుతం లహరి గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే… బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గుర్తున్నాడా.. కౌషల్. లహరి ఎలిమినేషన్ పై అతడు తీవ్రంగా స్పందించాడు. బిగ్ బాస్ నిర్వాహకులు చాల పెద్ద తప్పు చేశారంటూ విమర్శించారు. లాహరి ఎలిమినేషన్ అనేది సరికాదని.. అన్యాయంగా అమ్మాయిని బయటకు పంపించారని.. ఆమెను మళ్లీ హౌస్ లోకి రీ ఎంట్రీ చేయాలని అతడు అభిప్రాయపడ్డాడు.

ఈమేరకు లహరితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశాడు కౌశల్. హౌస్ లో నీ వైఖరి బాగుందని.. కానీ ఇంత త్వరగా బయటకు వచ్చేస్తావని తాను అనుకోలేదని అన్నారు. ‘లహరి కమ్ బ్యాక్ ’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను యాడ్ చేసి పోస్టు చేశాడు. దీనిపై నెటిజన్లు కూడా లహరి రీ ఎంట్రీ ఇవ్వాలని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.































