ఆంధ్రప్రదేశ్ రైతులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మంచి వార్తను అందించింది. 2025-26 ఖరీఫ్, రబీ సీజన్లకు పంట రుణ పరిమితిని రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ (SLBC) పెంచింది. ఈ పెంపుతో పాటు, వివిధ పంటలకు అదనపు రుణ సదుపాయం కల్పించబడుతోంది. ఈ ఏడాది వరి పంటకు ఎకరానికి రూ.5వేల నుంచి రూ.6వేల వరకు, పత్తి పంటకు రూ.4వేల నుంచి రూ.5వేల వరకు పెంచారు.

ఖరీఫ్ సీజన్‌లో వరికి రూ.46,000 నుంచి రూ.52,000 వరకు, రబీ సీజన్‌లో రూ.50,000 నుంచి రూ.55,000 వరకు రుణాలు మంజూరవుతాయి. శ్రీవరి పంటకు ఎకరానికి రూ.35,000 నుంచి రూ.40,000 వరకు రుణాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, ఎర్రమిర్చి సాగు కోసం ఎకరానికి రూ.35,000 నుంచి రూ.50,000 వరకు అదనపు నిధులు రైతులకు లభించనున్నాయి.
ఈ నిర్ణయం రైతులలో ఆనందాన్ని కలిగిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదంటూ వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, వ్యవసాయ పనిముట్లను 90 శాతం రాయితీతో అందించడంపై కూడా రైతులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
ఈ నిర్ణయంతో రైతులపై ఆర్థిక భారం తగ్గుతుందని, సాగు మరింత సులభంగా జరుగుతుందని ఆశిస్తున్నారు.































