దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వినియోగదారులకు గత కొన్నిరోజులుగా వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. కరోనా, లాక్ డౌన్ వల్ల ప్రజల ఆదాయం భారీగా తగ్గిన నేపథ్యంలో వడ్డీరేట్లను తగ్గిస్తూ ఎస్బీఐ బ్రహ్మాండమైన ఆఫర్లను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తుంది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఎస్బీఐ కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకునేవారికి బ్రహ్మాండమైన ఆఫర్లను ప్రకటించింది.
గృహ రుణాల వడ్డీ రేటుపై ఏకంగా 25 బేసిక్ పాయింట్ల రాయితీని ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ పొందాలంటే కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. ఎవరైతే ఎస్బీఐ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారో వారికి ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. అయితే ఎస్బీఐ రుణం తీసుకున్న వారి సిబిల్ స్కోరును సైతం పరిశీలిస్తోంది. అయితే 75 లక్షల రూపాయలకు పైగా హోం లోన్ తీసుకున్న వారికి మాత్రమే ఈ బేస్ రేటు వర్తింపు జరుగుతుంది.
గతంలో మధ్య తరగతి వర్గాల ప్రజలకు సైతం ప్రయోజనం చేకూరేలా పది నుంచి 20 బేసిక్ పాయింట్ల వరకు వడ్డీ రాయితీ ప్రకటించిన ప్రధాన నగరాలతో పాటు మెట్రో నగరాల్లో ఈ రాయితీ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాలను వెల్లడించింది. ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వినియోగదారులు ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 30 లక్షల రూపాయలకు పైగా 7 శాతం వడ్డీని.. 30 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉంటే 6.9 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఎస్బీఐ వినియోగదారులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తుండటం గమనార్హం.