మనలో చాలామంది కార్లను కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే కారును కొనుగోలు చేయడం కంటే కారుకు అవసరమైన పెట్రోల్, ఇతర ఖర్చులకే ఎక్కువమొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. అందువల్లే చాలామంది కారు కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. అయితే పెట్రోల్ అవసరం లేని కారు అందుబాటులోకి వస్తే మాత్రం వాహనదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దేశంలోని ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. వాహనదారులకు కార్లలో ఫ్లెక్సీ ఇంజిన్ ఆప్షన్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొస్తామని ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తే వాహనదారులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఈ నిర్ణయం వల్ల వాహనదారులు తమ వాహనాల్లో ఇంధనంగా ఇథనాల్ ను కూడా వాడుకునే అవకాశం కలుగుతుంది. వాహనదారులు వాహనంలో ఇథనాల్ ను వినియోగిస్తే తక్కువ ఖర్చుతోనే ప్రయాణం చేయవచ్చు.
చెరుకును వినియోగించి ఇథనాల్ ను తయారు చేయవచ్చని.. ప్రజలు వీలైనంత వరకు ఇథనాల్ వినియోగాన్ని పెంచితే ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ‘ఆత్మనిర్బర్ భారత్’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారాన్ని అందిస్తుందని వెల్లడించారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ల సహాయంతో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు.
ఆటోమేకర్లు గ్రీన్ ఫ్యూయల్ ను విక్రయించడానికి సొంతంగా ఫ్యూయల్ పంపులను ఏర్పాటు చేసుకోవచ్చని సూచనలు చేశారు. ఇప్పటికే ఇతర దేశాల్లో ఫ్లెక్స్ ఇంజిన్లను వినియోగిస్తున్నారు. బీఎస్-4 నుంచి కారు బీఎస్ 6కు మారితే ఫ్లెక్స్ ఇంజిన్లను అమర్చవచ్చు.































