మన దేశంలో ఎక్కువ మంది చైనా ఫోన్లను వినియోగిస్తున్నారనే సంగతి తెలిసిందే. తక్కువ ధరకు అందుబాటులోకి రావడంతో పాటు మెరుగైన ఫీచర్లు ఉండటం వల్ల చైనా ఫోన్లు కొనుగోలు చేయడానికి ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. అయితే చైనా దిగ్గజ మొబైల్ కంపెనీలలో ఒకటైన జియోనీ కంపెనీ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. కస్టమర్లకు తెలియకుండా ఫోన్లలో ట్రోజన్ హార్స్ అనే వైరస్ ను ప్రవేశపెట్టింది.

దాదాపు 2 కోట్ల ఫోన్లలో జియోనీ ఉద్దేశపూర్వకంగా ఈ వైరస్ ను ప్రవేశపెట్టినట్టు సమాచారం. చైనా దేశంలోని ఒక కోర్టు జియోనీ కంపెనీ చేస్తున్న మోసాన్ని గుర్తించి బట్టబయలు చేసింది. జియోనీ కంపెనీ భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని కస్టమర్ల ఫోన్లలో కస్టమర్లకు తెలియకుండా అనుచిత ప్రకటనలు వచ్చేలా, హానికరమైన కార్యకలాపాలు జరిగేలా వైరస్ ను ఇన్ బిల్డ్ చేసినట్టు తెలుస్తోంది.
“స్టోరీ లాక్ స్క్రీన్” అనే యాప్ సహాయంతో కస్టమర్ల ఫోన్లలో జియోనీ కంపెనీ అనుబంధ సంస్థలలో ఒకటైన షెన్‌జెన్ జిపు టెక్నాలజీ కో లిమిటెడ్ కంపెనీ సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేస్తామని చెప్పి వైరస్ ను మొబైల్ ఫోన్ లో ప్రవేశపెట్టింది. 2018 సంవత్సరం నుంచి గతేడాది అక్టోబర్ వరకు ఈ ప్రక్రియ కొనసాగిందని సమాచారం. వైరస్ ను ప్రవేశపెట్టడం వల్ల జియోనీ కంపెనీకి ఏకంగా 4.2 మిలియన్ల ఆదాయం చేకూరింది.
ఫోన్లలో డేంజరస్ వైరస్ ను ప్రవేశపెట్టిన వారికి కోర్టు మూడు నుంచి మూడున్నర సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరు 22,59,738 రూపాయలు ఫైన్ చెల్లించేలా కోర్టు అదేశాలు జారీ చేసింది. జియోనీ కంపెనీతో పాటు మరికొన్ని చైనా కంపెనీలు కూడా ఈ తరహా మోసానికి పాల్పడ్డాయని సమాచారం.
































