
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది. మైర్మేకో ఫోబియా (చీమలకు భయం) అనే అరుదైన మానసిక సమస్యతో బాధపడుతున్న ఒక యువతి తీవ్ర మానసిక ఒత్తిడిలో ఆత్మహత్యకు పాల్పడింది.
చిన్నప్పటి నుంచే చీమల భయం – ఫోబియాగా మారిన సమస్య
మంచిర్యాల జిల్లా మూలంగా ఉన్న మనీషా (25)కు చిన్నప్పటి నుంచే చీమలు అంటే విపరీతమైన భయం ఉండేది. ఈ భయం కాలక్రమంలో తీవ్రమై, మైర్మేకో ఫోబియా అనే అరుదైన మానసిక వ్యాధిగా మారింది. భర్త శ్రీకాంత్ ఉద్యోగ కారణంగా ఈ దంపతులు సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పరిధిలోని నవ్యా హోమ్స్‌లో నివసిస్తున్నారు. వీరికి అంబిక అనే మూడేళ్ల కుమార్తె ఉంది.
ఫోబియా తీవ్రత పెరిగి విషాదానికి దారితీసింది
మనీషా గతంలో పలు సార్లు వైద్యుల సలహాలు మరియు కౌన్సిలింగ్‌లు తీసుకున్నప్పటికీ, ఆమె భయం తగ్గలేదు. చీమలను చూసినా గడగడలాడిపోతూ, తీవ్రమైన భయంతో కుంగిపోయేది. రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె మనసు దృఢంగా చేసుకుని ఉరి వేసుకుంది.
భర్త శ్రీకాంత్ ఇంటికి వచ్చి ఆ దృశ్యం చూసి షాక్ అయి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
హృదయవిదారక సూసైడ్ నోట్
మనీషా రాసిన సూసైడ్ నోట్‌లో తన ఆవేదనను వ్యక్తపరిచింది.
“ఐ యామ్ సారీ… నాకు చీమలు అంటే చాలా భయం. అన్విజాగ్రత్తగా ఉండు. అన్నవరం, తిరుపతి, ఎల్లమ్మ వ్రతాలు మర్చిపోకు” అని పేర్కొనడం హృదయవిదారకంగా ఉందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైర్మేకో ఫోబియా కారణంగా ఈ యువతి ప్రాణాలు తీసుకోవడం మానసిక ఆరోగ్యంపై అవగాహన ఎంత అవసరమో మరోసారి గుర్తుచేసింది.































