శోభన్ బాబు, చిరంజీవి ఇద్దరూ కష్టపడి సినిమాల్లోకి వచ్చారన్నది నిజం. ఎవరి అండదండలు లేకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించిన కథానాయకులు. శోభన్ బాబు తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టే సమయానికి ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి దిగ్గజాలు తమ హవాను కొనసాగిస్తున్నారు.

మద్రాసులో కాలేజీలో చదువుకుంటూ.. ఒకపక్క స్టూడియోల చుట్టూ అవకాశాల కోసం శోభన్ బాబు తిరిగేవారు. ఆ క్రమంలో ఆయనకు ఎన్టీఆర్ నటిస్తున్న “దైవబలం” చిత్రంలో ఒక పాత్రలో నటించే అవకాశం వచ్చింది.

అలా ప్రారంభమైన తన సినీ ప్రయాణం అంచెలంచెలుగా ఎదుగుతూ సోగ్గాడు, పండంటి కాపురం, కార్తీక దీపం, దేవత లాంటి చిత్రాలు ఆయనను మహిళా ప్రేక్షకులకు దగ్గర చేశాయి. అలా ఆయన 1975లో సమతాఆర్ట్స్, యోగేంద్ర నిర్మాణం, వి.మధుసూధనరావు దర్శకత్వంలో “జేబుదొంగ” చిత్రం విడుదలయింది. ఈ సినిమాలో శోభన్ బాబు, మంజుల హీరో,హీరోయిన్లుగా నటించారు. ముళ్ళపూడి వెంకటరమణ మాటలు అందించగా చక్రవర్తి గీతాలను సమకూర్చారు. ఈ సంవత్సరం “సోగ్గాడు” లాంటి కుటుంబపరమైన అద్భుత విజయంతో పాటు “జేబుదొంగ” లాంటి మాస్ చిత్రం కూడా ప్రేక్షకులను అలరించింది.

1978లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ శిక్షణ పూర్తి చేసిన తర్వాత చిరంజీవి ప్రాణంఖరీదు, పునాదిరాళ్లు చిత్రాలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం జరిగింది. ఆ సమయానికి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి ఉద్దండుల హవాలో.. చిరంజీవి డాన్సు ఫైట్లతో తనకంటూ కొత్త ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఖైదీ, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, ఇంద్ర లాంటి చిత్రాలతో మెగాస్టార్ మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

1987 అర్జున్ రాజు, రామలింగరాజు నిర్మాణం, ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “జేబుదొంగ” చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి, రాధ, భానుప్రియ హీరో, హీరోయిన్లుగా నటించారు. లోగడ శోభన్ బాబు, చిరంజీవి “మోసగాడు” లాంటి చిత్రాల్లో కలిసి నటించారు. ఒకే టైటిల్ తో వచ్చిన ఈ ఇద్దరు హీరోల చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించాయి.


































