అనుభవమైతే కానీ తత్వం బోధపడదని అంటారు పెద్దలు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విషయంలో అదే జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఇప్పుడు టీడీపీ, జనసేనల అవసరం ఉంది కాబట్టి ఏపీకి వరాల జల్లును ప్రధాని మోదీ కురిపించారు కానీ పదేళ్ల పాటు అసలు తెలుగు రాష్ట్రాల వైపే చూడలేదు. ఆ మాట కొస్తే తెలంగాణ సహా తనకు అవసరం లేని ఏ రాష్ట్రాల వైపు మోదీ చూడరు అనేది జగమెరిగిన సత్యం. గులాబీ బాస్ కేసీఆర్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించారు. ఆ పదేళ్లూ మోదీయే ప్రధానిగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో అధికారం మారింది కానీ కేంద్రంలో మారలేదు. తెలంగాణ ఎప్పుడు సామంత రాజుల మాదిరిగా కేంద్రానికి పన్నుల రూపంలో కప్పం కట్టుడే కానీ.. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. జీఎస్టీ పేరిట రాష్ట్రాలకు రావల్సిన పన్నులను సైతం కేంద్రమే ఎగరేసుకుపోతోంది. దీంతో రాష్ట్రాలు వాటి బాధ అవి పడుతున్నాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నంత కాలం కూడా కేంద్రంతో పలుమార్లు భేటీ అయినా కూడా ఒరిగిందేమీ లేదు.

తెలంగాణ వైపు కూడా చూడలే..
ఇక తెలంగాణలో మోదీకి అవసరం లేదు కాబట్టి ఆయన పొరపాటున కూడా ఏమీ విదల్చరని గ్రహించిన కేసీఆర్ కేంద్రంలో మోదీని గద్దె దింపాలనుకున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్‌ను స్థాపించి మొత్తానికే ఇబ్బందుల్లో పడ్డారు. అప్పట్లోనూ ఈ నీతి ఆయోగ్ వంటి సమావేశాలు జరిగాయి. కానీ కేసీఆర్ మాత్రం వెళ్లేవారు కాదు.. దీనిని రేవంత్ సహా చాలా మంది కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. అక్కడికి వెళ్లినా ఒరిగేదేమీ ఉండదని కేసీఆర్ చెప్పేవారు. ఇన్నాళ్లకు ఈ విషయం రేవంత్‌కు కూడా బోధ పడింది. తొలినాళ్లలో అయితే రేవంత్ ప్రధాని వస్తున్నారంటే నానా హంగామా చేసేవారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించడం వంటివి చేసేవారు. పైగా పెద్దన్న, బడేమియా అంటూ ఆకాశానికి ఎత్తేసేవారు. అయినా ప్రయోజనం శూన్యం. కేంద్ర బడ్జెట్ విషయంలో తెలంగాణ వైపు కూడా మోదీ చూడలేదు. దీంతో రేవంత్‌కు మోదీ ఏంటనేది బాగా తెలుసొచ్చిందట. ఇక మీదట మోదీ రాష్ట్రానికి వచ్చినా దేఖను కూడా దేఖరేమో.. ఢిల్లీకి వెళ్లి మోదీ సహా కేంద్ర మంత్రులతో భేటీ అయినా కూడా పట్టించుకోలేదు. దీంతో ఇక మీదట మోదీని కూడా మనం పట్టించుకోకూడదని రేవంత్ ఫిక్స్ అయినట్టు సమాచారం.

మరో కేసీఆర్‌లా రేవంత్..
ఇప్పుడు కేసీఆర్ బాటలోనే రేవంత్ కూడా నడవనున్నారు. ఇవాళ జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ చెప్పిన ఆన్సరే. వెళితే వాళ్లు పెట్టే పల్లీ బఠాని తిని రావడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. వాళ్లు చెప్పేది వినాలే తప్ప. మనం చెబితే వినే నాథుడే ఉండరక్కడ అని కేసీఆర్ అనేవారు. కానీ అప్పట్లో రేవంత్ మాత్రం ఎందుకు వెళ్లరు? రాష్ట్ర సమస్యలను చర్చించాలి కదా అంటూ ధూం ధాం చేసేవారు. ఇప్పుడు తత్వం బోధ పడింది. రేవంత్ కూడా బడేమియాను దూరం పెట్టేశారు. ఈ క్రమంలోనే బడ్జెట్‌లో మొండి చేయి చూపించడంపై తెలంగాణ అసెంబ్లీలో ఓ తీర్మానం కూడా చేశారు. మొత్తానికి రేవంత్ మరో కేసీఆర్‌లా మారుతున్నారు. అయితే రేవంత్‌కు ఒక ప్లస్ ఏంటంటే.. ఇండియా కూటమిలోని కీలక పార్టీలో ఉన్నారు. కేసీఆర్ ఒంటరి వారు అంతే తేడా.. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇక మనం మొన్నటి వరకూ మోదీ వర్సెస్ కేసీఆర్ చూశాం.. ఇక ఇప్పటి నుంచి రేవంత్ వర్సెస్ మోదీ వార్ ఎలా ఉండబోతోందో చూడాలి.
































