కంటికి కనిపించని కరోనా వైరస్ మనిషి ప్రాణం తీస్తోంది. వైరస్ నుంచి కోలుకున్న వారిలో సైతం దుష్ప్రభావాలను చూపుతోంది. ఇప్పటివరకు కరోనా వైరస్ గురించి వెలుగులోకి వచ్చిన విషయాల్లో మహమ్మారి ఎక్కువగా శరీరంలోని ప్రధాన అవయవమైన లంగ్స్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు తేలింది. అయితే శాస్త్రవేత్తలు మాత్రం కరోనాను తేలికగా భావించవద్దని శరీరంలోని అన్ని అవయవాలపై ఈ వైరస్ దాడి చేస్తోందని చెబుతున్నారు.

కరోనా గురించి అధ్యయనంలో వెలుగులోకి వచ్చిన ఈ విషయాలు వైరస్ మనిషికి ఎంత ప్రమాదకరమో అర్థమయ్యేలా చేస్తున్నాయి. ముక్కు, నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశించే ఈ వైరస్ కిడ్నీ, లివర్, గుండెపై కూడా ప్రభావం చూపిస్తుండటంతో ప్రజలు వైరస్ బారిన పడకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. శాస్త్రవేత్తలు కరోనా ప్రభావం శరీరానికి రెండు విధాలుగా ఉంటుందని వెల్లడిస్తున్నారు.
కరోనా వైరస్ సోకిన వారిలో కొందరి అవయవాలపై ప్రత్యక్షంగా దాడి చేస్తూ తీవ్ర ప్రభావం చూపుతోందని.. మరి కొందరిలో మాత్రం అవయవాలను పరోక్షంగా పాడు చేస్తోందని వెల్లడిస్తున్నారు. దేశంలోని చాలామందికి కరోనా వైరస్ సోకినా వైరస్ కు సంబంధించిన లక్షణాలు కనిపించడం లేదు. అయితే కరోనా లక్షణాలు కనిపించని వారిలో కిడ్నీ సమస్యలు, పక్షవాతం, చెస్ట్ పెయిన్ లాంటి సమస్యలు కనిపిస్తున్నాయి.
కొంతమందిలో రక్తం గడ్డ కడుతోంటే మరి కొందరిలో అవయవాలు దెబ్బ తింటున్నాయి. ఈ వయస్సు ఆ వయస్సు అనే తేడాల్లేకుండా అన్ని వయస్సుల వారిపై వైరస్ ప్రభావం పడుతోంది. కరోనా వైరస్ గుండెపై అనేక రకాలుగా ప్రభావం చూపుతుండటం గమనార్హం. శరీరంలోని కొన్ని అవయవాలకు కరోనా వైరస్ అతుక్కుంటూ అవయవాలను పీల్చి పిప్పి చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.