చాలామంది కేంద్ర ప్రభుత్వం వార్షిక ఆదాయాన్ని బట్టి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను అమలు చేస్తుందని భావిస్తారు. అయితే కేంద్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వ్యవసాయ భూమిని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఒక కుటుంబానికి ఐదెకరాలు లేదా అంతకంటే ఎక్కువగా వ్యవసాయ భూమి ఉంటే ఆ కుటుంబంలో సభ్యులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అర్హులు కాదు.

అదే సమయంలో వ్యవసాయ పొలంతో పాటు 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలంలో నివాస గృహం లేదా ఫ్లాట్ ఉన్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అర్హత పొందలేరు. మున్సిపాలిటీలు, నోటిఫైడ్ పురపాలికలలో 100 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ స్థలంలో నివాస స్థలం ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో 200 చదరపు గజాలు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో నివాస స్థలం ఉన్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించవు.
8 లక్షల రూపాయల లోపు సంవత్సర ఆదాయం ఉండటంతో పాటు ఈ పరిమితుల లోపు ఆస్తులు ఉంటే మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అర్హత పొందే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల కింద రాని వారు ఈ విధంగా అర్హత పొందవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు సిద్ధమైన నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు జరిగే అవకాశం ఉంటుంది.
ఈడబ్ల్యూఎస్ కోటాను ఎవరైతే కోరుకుంటారో వారి కుటుంబ సభ్యుల వేతనాలు, వ్యాపారం, వ్యవసాయం, వృత్తి, ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయాన్ని కుటుంబ సభ్యుల ఆదాయంగా లెక్కిస్తారు.



























