హైదరాబాద్, సెప్టెంబర్ 3, 2025: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత పార్టీపై సంచలన ఆరోపణలు చేస్తూ, బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జూబ్లిహిల్స్‌లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

‘జై తెలంగాణ.. జై జాగృతి’ అని నినాదం చేస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన కవిత, తనపై బీఆర్ఎస్ పార్టీ జారీ చేసిన సస్పెన్షన్ ఆర్డర్‌ను చదవి వినిపించారు. నిన్న మధ్యాహ్నం బీఆర్ఎస్ నుంచి వచ్చిన ప్రకటనలో తన ప్రవర్తన, పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారని ఆమె తెలిపారు. “జన్మనిచ్చిన తండ్రి కేసీఆర్ చిటికన వేలు పట్టుకుని ఉద్యమాలు చేయడం నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు పార్టీలో ఇద్దరు పనిగట్టుకుని నాపై విషప్రచారం చేస్తున్నారు,” అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ కోసం పోరాటాలు
తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత తాను గురుకుల పాఠశాలల పరిస్థితులపై, బనకచర్ల వద్ద రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం, సీఎం జిల్లాలో భూ నిర్వాసితులకు అండగా నిలబడడం, పెన్షన్ల పెంపు కోసం పోర్టు కార్డు ఉద్యమం, ఆడబిడ్డలకు ఆర్థిక సాయం కోసం పోరాటాలు చేసినట్లు కవిత వివరించారు. “నవంబర్ నుంచి 47 నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేశాను. గులాబీ కండువా కప్పుకుని చేసిన ఈ పోరాటాలు పార్టీకి ఎలా వ్యతిరేకం అవుతాయి?” అని ఆమె ప్రశ్నించారు.
హరీశ్ రావు, సంతోష్ రావుపై ఆరోపణలు
పార్టీలో కొందరు తనపై కుట్రలు చేస్తున్నారని, ముఖ్యంగా మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు తనపై విషప్రచారం చేస్తున్నారని కవిత సంచలన ఆరోపణలు చేశారు. “హరీశ్ రావు, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే అది బంగారు తెలంగాణ కాదు,” అని వ్యాఖ్యానించారు. “కేసీఆర్‌పై సీబీఐ విచారణ వచ్చే వరకు పరిస్థితి తీసుకొచ్చిన వాళ్లు వీళ్లే. రేవంత్ రెడ్డితో కలిసి హరీశ్ రావు ఒకే విమానంలో ప్రయాణించలేదా? రేవంత్‌కు సరెండర్ అయిన తర్వాతే నాపై కుట్రలు మొదలయ్యాయి,” అని ఆమె ఆరోపించారు.
కవిత మాట్లాడుతూ, “హరీశ్ రావుపై ఆరోపణలు ఒక్క రోజు మాత్రమే మీడియాలో వస్తాయి, రెండో రోజు ఎవరూ మాట్లాడరు. రేవంత్ రెడ్డి, హరీశ్ రావు మధ్య లాలూచీ బయటపడుతోంది,” అని విమర్శించారు. “నాన్న, పార్టీలో ఏం జరుగుతోందో చూడండి. హరీశ్ రావు, సంతోష్ రావు మెకవన్నె పులులు అని చెప్పినా కేసీఆర్ వినిపించుకోవడం లేదు,” అని ఆవేదన వ్యక్తం చేశారు.
కేటీఆర్‌పై కవిత ఆగ్రహం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కూడా కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “చెల్లిగా, మహిళా ఎమ్మెల్సీగా నేను బాధపడుతుంటే, అన్నగా కేటీఆర్ ఏం చేయలేదు. 103 రోజులైనా నన్ను అడగలేదు. వ్యక్తిగత లబ్ధి కోసం కొందరు నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు,” అని ఆరోపించారు. “రేపు కేటీఆర్‌పై, నా తండ్రిపై ఇలాంటి కుట్రలే జరగొచ్చు,” అని హెచ్చరించారు.
రాజీనామా ప్రకటన
ఈ నేపథ్యంలో కవిత, ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. “పార్టీని కొందరు తమ హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు. నా ప్రాణం పోయినా కేసీఆర్, కేటీఆర్‌లకు హాని జరగకూడదని కోరుకుంటాను. కానీ, నేను ఇక ఈ పార్టీలో కొనసాగలేను,” అని ఆమె స్పష్టం చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను పంపుతున్నట్లు తెలిపారు.
పార్టీ నుంచి స్పందన
బీఆర్ఎస్ సీనియర్ నేతలు కవిత సస్పెన్షన్‌ను స్వాగతించారు. “కవిత తన తీరుతో గత మూడు నెలలుగా పార్టీకి నష్టం కలిగించారు. కేసీఆర్‌కు కుటుంబం కంటే పార్టీ శ్రేయస్సే ముఖ్యం,” అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖ్యానించారు. కేటీఆర్, హరీశ్ రావు పార్టీకి కుడి, ఎడమ భుజాలని వారు కొనియాడారు.
కవిత ఆరోపణలు, సస్పెన్షన్, రాజీనామా ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
































