Daggubati Rana: దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి రానా ఎంతో వైవిద్య భరితమైన సినిమాలను చేస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం ఈయన తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ మార్చి 10న నెట్ఫ్లిక్స్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో రానా పెద్ద ఎత్తున ఈ వెబ్ సిరీస్ ను ప్రమోట్ చేస్తూ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఈయన టాలీవుడ్ హీరోలు అయినటువంటి ప్రభాస్ మహేష్ బాబుల గురించి పలు విషయాలు తెలియజేశారు.గత ఐదు సంవత్సరాల క్రితం వరకు బాలీవుడ్ ప్రేక్షకులకు మన తెలుగు హీరోలు ఎవరో కూడా తెలియదు.
ఇప్పుడు మాత్రం తెలుగులో విడుదలైన సినిమాలు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో మంచి సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నేను నటించిన ఘాజి సినిమా హిందీలో కూడా మంచిగా కలెక్షన్లు సాధించిందని తెలిపారు. ఇక బాహుబలి సినిమా ముందు వరకు కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు ప్రభాస్ అంటే ఎవరో కూడా తెలియదని రానా తెలిపారు.
బాహుబలి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ముంబైకి చెందిన తన ఫ్రెండ్ ఫోన్ చేసి ఏం సినిమాలు చేస్తున్నావని అడగడంతో బాహుబలి సినిమాలో చేస్తున్నానని చెప్పాను. అందులో నువ్వే నా హీరో అని అడిగారు.కాదు ప్రభాస్ అని చెప్పగా ప్రభాస్ అంటే ఎవరు అని తనని ప్రశ్నించినట్లు రానా గుర్తు చేసుకున్నారు. ప్రభాస్ నటించిన కొన్ని సినిమాల గురించి చెప్పినప్పటికీ తనకు తెలియదని సమాధానం చెప్పారు.

Daggubati Rana: నమ్రత భర్తగా మాత్రమే మహేష్ తెలుసు..
ఇక మహేష్ బాబు గురించి చెబితే ఓ చిన్ను భర్త కదా తెలుసు అంటూ సమాధానం చెప్పారు.ఒక క్షణం పాటు అసలు ఈ చిన్ను ఎవరని తాను ఆలోచించానని ఆ తర్వాత నమ్రతను బాలీవుడ్ వారు చిన్ను అని పిలుచుకుంటారని అర్థమైందని రానా తెలిపారు.గత నాలుగు సంవత్సరాల క్రితం వరకు బాలీవుడ్ వారికి ప్రభాస్ అంటే ఎవరో తెలియదు మహేష్ బాబు కూడా నమ్రత భర్తగా మాత్రమే తెలుసు అని తెలిపారు.దీంతో ఒక నాలుగైదు సంవత్సరాల ఆగు మా తెలుగు హీరోలందరూ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ల్యాండ్ అవుతారు అంటూ తనకి చెప్పాను. చెప్పిన విధంగానే తెలుగు హీరోలకు బాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు రావడం సంతోషంగా ఉంది అంటూ రానా తెలియజేశారు.































