తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై విషాద ఛాయలు అలుముకున్నాయి. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బ రూప గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం వేళ జరిగిన ఈ ఘటన పార్టీ శ్రేణులను, కార్యకర్తలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

చికిత్స పొందుతూ మృతి
సమాచారం ప్రకారం, దుబ్బ రూప గురువారం ఉదయం నల్గొండలోని తన నివాసంలో ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు.
- చికిత్స: కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు మార్చగా, వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. చికిత్స పొందుతూనే ఆమె ప్రాణాలు కోల్పోయారు.
పార్టీకి తీరని లోటు
దుబ్బ రూప మరణం పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె ఇటీవల రోజుల్లో పార్టీ కార్యక్రమాల్లో చరుకుగా పాల్గొంటూ, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ప్రచారానికి ప్రధాన బలం గా నిలిచారు. రెండు రోజుల క్రితమే ఆమె సభల్లో పాల్గొనడం, నేతలతో సమావేశాలు కావడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
పార్టీ వర్గాల ప్రకారం, రూప మహిళా కాంగ్రెస్ లో పటిష్ఠమైన స్థానం ఏర్పరుచుకున్న నేతగా గుర్తింపు పొందారు. ఆమె మరణం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పెద్ద లోటని నేతలు పేర్కొన్నారు.
నేతల సంతాపం
దుబ్బ రూప మరణంపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఇతర కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
































