ప్రస్తుతం మార్కెట్లో మనకు వివిధ రకాల బియ్యం అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న రకం నల్లబియ్యం.ప్రస్తుతం మార్కెట్లో ఈ నల్ల బియ్యానికి బాగా డిమాండ్ పెరిగింది. 2 సంవత్సరాల క్రితం కృష్ణాజిల్లాలో అర ఎకరాలో సాగు చేసిన ఈ బియ్యం తాజాగా 20 ఎకరాలలో సాగు చేస్తున్నారు.ఈ విధమైనటువంటి నల్ల బియ్యాన్ని క్రిమిసంహారక మందులతో కాకుండా పూర్తిగా జీవ ఎరువులతో తయారు చేయటం వల్ల ఈ బియ్యానికి అధిక డిమాండ్ ఏర్పడింది.

సాధారణ వరి రకం ఎకరానికి 25–30 బస్తాల దిగుబడి వస్తే ఈ నల్లబియ్యం మాత్రం ఎకరాకు 10–15 బస్తాలు మాత్రమే వస్తుంది. బ్లాక్ రైస్ ను రైతులు కిలో 170 నుంచి 180 వరకు విక్రయించగా మార్కెట్లో మాత్రం కిలో ధర ఏకంగా 300 నుంచి 350 వరకు ధర పలుకుతోంది.ఈ విధంగా ఈ బియ్యానికి అధిక డిమాండ్ ఏర్పడటానికి కారణం ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉండటమే.
నల్ల బియ్యంలో అత్యధికంగా ఆంకోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లుగా ఉంటాయి. ఇవి నిరోధక ఎంజైములను క్రియాశీలకం చేసి మధుమేహం, గుండెజబ్బులు వంటి సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం కల్పిస్తుంది. అదేవిధంగా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో యాంటీ ఆక్సిడెంట్లు కీలకపాత్ర పోషిస్తాయి.విటమిన్–బి, ఇ, నియాసిన్,క్యాల్షియం మెగ్నీషియం ఫైబర్ వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి కనుక ఈ బియ్యానికి మార్కెట్లో అధిక డిమాండ్ ఏర్పడింది.
నల్ల బియ్యాన్ని కేవలం జీవ ఎరువులతో తయారు చేయటం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిదని భావించడం వల్లే ఈ బియ్యానికి మార్కెట్లో పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. ఎంతో డిమాండ్ ఉన్న ఈ పంటను ఎక్కువ సాగు చేయడానికి రైతులు వెనకడుగు వేస్తున్నారు.అందుకు గల కారణం ఇవి చాలా ఎత్తు పెరగటం వల్ల చిన్నపాటి గాలి వీచిన పంట మొత్తం నాశనం అవుతుంది.



























