తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు చెందిన విలువైన భూములను టూరిజం శాఖకు బదలాయించడంపై పెద్ద వివాదం రేగింది. అలిపిరి రోడ్డులోని దాదాపు రూ.1500 కోట్ల విలువ గల 25 ఎకరాల భూమిని బదిలీ చేయడంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు
టీటీడీ బోర్డు సమావేశంలో తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని భూమన ఆరోపించారు. “దేవుడి భూమిని రక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుదే. అలాంటి విలువైన భూమిని వాణిజ్య ప్రయోజనాల కోసం టూరిజం శాఖకు ఇవ్వడం దేవుడిపై నమ్మకం ఉన్న కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఈ భూమిని ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి కేటాయించారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ భూమిని పర్యాటకం కోసం కేటాయించవచ్చని, కానీ టీటీడీ భూములనే ఎందుకు వాడుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం
టీటీడీ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి నిర్ణయం జరగలేదని, ఈ చర్యను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని భూమన తెలిపారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. టీటీడీ భూములపై తీసుకున్న ఈ నిర్ణయం మరిన్ని వివాదాలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.



































