సినిమా ఫీల్డ్‌లో ఉన్న చాలా మందికి ఎలాంటి వ్యసనాలూ లేవని ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి స్పష్టం చేశారు. వాళ్లలో ఏవీఎస్, బ్రహ్మనందం అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఆ లిస్ట్‌లో ఉంటారని ఆయన అన్నారు. సినిమా వల్ల వ్యసనపరులైన వాళ్లు చాలా తక్కువ అని ఆయన చెప్పారు.

ఇక నిజం చెప్పాలంటే హీరో అంటే ఏదో అనుకుంటాం గానీ, వాళ్లు చాలా కష్టపడతారని తనికెళ్ల భరణి అన్నారు. వాళ్లు పడే కష్టం చూస్తే కళ్లకు నీళ్లు వస్తాయని, మామూలు శ్రమ ఉండదు వాళ్లకు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక తాను ముందు నుంచీ చూస్తున్న నటులలో ఒకరైన అల్లు అర్జున్ చాలా కష్టపడతారని ఆయన తెలిపారు. ఆయన డ్యాన్స్‌లో పడే కష్టం, ఒక స్టెప్ కొంచెం తప్పు వచ్చినా మళ్లీ చేస్తారని తనికెళ్లభరణి, బన్నీ గురించి చెప్పారు. వాళ్ల పక్కనే బాడీ గార్డులా ఉండే డైటింగ్ స్పెషలిస్ట్‌లు వాళ్లను ఏం తిననివ్వరు, తాగనివ్వరని ఆయన అన్నారు. అలాంటి వాళ్లను పక్కన పెట్టుకొని కేవలం ఆ శరీర ఆకృతిని కాపాడుకునే శ్రమతో పోలిస్తే తమ కష్టం ఏమీ ఉండదని ఆయన వివరించారు.
అందుకే వాళ్లు అంత కష్టపడుతున్నందుకు అంత డబ్బు ఇస్తున్నారని, లేదా అంత డబ్బు ఇస్తున్నందుకు అంత కష్టపడుతున్నారని దానికి ఏదైనా చెప్పుకోవచ్చని ఆయన అన్నారు. ఆ విషయంలో హీరోయిన్లు కూడా అంతే సమానంగా కష్టపడతారని తనికెళ్ల భరణి అన్నారు. ఏదైనా తినాలన్నా కూడా వాళ్లు చాలా ఆలోచిస్తారని, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారని, ఆయన చెప్పారు. మామూలు వాళ్లైనా నిర్లక్ష్యంగా ఉంటారేమో గానీ సినిమా వాళ్లు మాత్రం ఎలాంటి వ్యసనాలకు దగ్గర కారని ఆయన మరోసారి చెప్పుకొచ్చారు. లేదంటే వాళ్లకు అసలు సినిమా అవకాశాలు రావు కదా అని ఆయన చెప్పారు. కాబట్టి సినిమా కూడా తమకి క్రమశిక్షణను నేర్పిస్తుంది, గౌరవాన్ని కూడ తెచ్చిపెడుతుందని ఆయన తెలిపారు.































