దశాబ్దాల కాలం నుంచి ఎన్నో సినిమాలలో విభిన్న పాత్రల్లో నటించి ఎంతోమంది ప్రేక్షకాదరణ సంపాదించుకున్న వారిలో చలపతిరావు ఒకరు. విలక్షణ నటుడిగా, తండ్రిగా, తాత పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. కెరీర్ మొదట్లో విలన్ పాత్రలో నటించిన చలపతిరావు ఆ తరువాత తండ్రి, తాతల పాత్రలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. నాగార్జున హీరోగా నటించినటువంటి “నిన్నే పెళ్ళాడుతా”చిత్రంలో నాగార్జునకి తండ్రి పాత్రలో నటించారు. ఆ పాత్రే చలపతిరావు కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అయిందని చెప్పవచ్చు.

ఇక చలపతిరావు వ్యక్తిగత విషయానికి వస్తే తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చలపతిరావుకి ముగ్గురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు కాగా, కొడుకు రవిబాబు. నటుడిగా, దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎంతగానో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య ముగ్గురు పిల్లలకు జన్మనివ్వగానే మరణించారు. అయితే తను అగ్నిప్రమాదంలో మరణించిందని ఓ సందర్భంలో చలపతిరావు తెలియజేశారు.

అప్పట్లో మద్రాసులో రెండు రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవి.ఒక రోజు రాత్రి రెండుగంటల సమయంలో నీళ్ళు వస్తే తాను పడతానని చలపతిరావు అనగా మీరు పడుకోండి నేను పడతానని చెప్పి తన భార్య వెళ్లిందని, వెళ్ళిన కొద్దిసేపటికి “నిన్నే.. నిన్నే” అనే మాటలు వినిపించాయి. ఏంటా అని వెళ్లి చూసేసరికి వంట గదిలో తన భార్య చీర అంటుకుని మంటలలో కాలిపోతోంది.

వెంటనే మంటలను ఆర్పి తనని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్ళాను అప్పటికే వెనక భాగం మొత్తం పూర్తిగా కాలిపోయింది. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తను చివరి రోజు ఆ పిల్లల వేదన భరించలేవు మరో పెళ్లి చేసుకో అంటూ ఆమె మరణించిందని చలపతిరావు చెప్పారు. అయితే ఆ ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని తన భార్య చెప్పలేకపోయింది. అయితే తన భార్య మరణించిన తర్వాత ఎంతో మంది మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పినప్పటికీ చలపతిరావు పెళ్లి చేసుకోకుండా పిల్లలను పెంచి పోషించారు. ప్రస్తుతం ముగ్గురు పిల్లలు జీవితంలో బాగా సెటిల్ అయ్యారని తెలియజేశారు.































