తొలి ఏకాదశి 2025 (జూలై 6, ఆదివారం) హిందూ ధర్మంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగిన పవిత్ర దినంగా పరిగణించబడుతుంది. ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళతారని విశ్వాసం. ఇది చాతుర్మాస ప్రారంభమైన రోజు కావడంతో, వచ్చే నాలుగు నెలల పాటు పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు నిర్వహించరు. ఈ పవిత్ర తిథిలో శారీరక, మానసికంగా స్వచ్ఛంగా ఉండడం ఎంతో ముఖ్యం. కొందరు తెలియక, మరికొందరు నిర్లక్ష్యంతో కొన్ని పనులు చేస్తూ పాపాల బారిన పడతారు. అలా జరగకుండా ఉండేందుకు తొలి ఏకాదశి రోజు ఏమి చేయకూడదో తెలుసుకోవడం అవసరం.

తొలి ఏకాదశి నాడు తులసి ఆకులను కోయకూడదు. తులసిని శ్రీమహావిష్ణువు అత్యంత ప్రీతిపాత్రంగా భావించబడుతుంది. అందువల్ల ఈ రోజున తులసి మొక్కను తాకడం, దాని ఆకులను కోయడం చేయరాదు. ఒకవేళ పూజ కోసం అవసరమైతే ముందురోజే కోసుకొని పెట్టుకోవాలి. అలాగే ఈ రోజున ఉపవాసం ఉండాలి. అన్నం తినడం ద్వారా తదుపరి జన్మలో క్రిమిగా జన్మిస్తారనే నమ్మకం ఉంది. మాంసాహారం, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మద్యం వంటివి కూడా పూర్తిగా నివారించాలి.
ఈ రోజు జుట్టు లేదా గోర్లు కత్తిరించడం, షేవింగ్ చేయడం వంటి కార్యకలాపాలు మంచిది కావు. ఇది పేదరికానికి దారి తీస్తుందని, ఇంట్లో అశుభ ఫలితాలను తెస్తుందని పెద్దలు చెబుతారు. మొదటి ఏకాదశి నాడు మనస్సులో కోపం, ద్వేషం, తిట్లు, అవమానాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇతరులతో గొడవలు పడకూడదు, చాడీలు చెప్పకూడదు. పగలు నిద్రపోవడం కూడా మంచిదిగా పరిగణించరు. ఉదయాన్నే లేచి భజనలు, జపాలు, పఠనాలు చేస్తూ శ్రీమహావిష్ణువు పూజకు సమయం కేటాయించాలి.
అంతేకాదు, ఈ రోజున దానధర్మాలు చేయడం ఎంతో శుభకరం. ఎవరైనా దానం ఇస్తే దానిని నిరాకరించకూడదు. అలాంటి నిరాకరణ వల్ల పుణ్యం కాకుండా పాపం పొందే ప్రమాదం ఉంటుంది. తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ మనస్సు, మాట, చేతల్లో స్వచ్ఛతతో ఉండాలి. ఈ విధంగా ఈ పవిత్ర తిథిని ఆచరించడంలో భాగస్వాములు కావడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగడమే కాకుండా, భగవత్‌కృపను కూడా పొందవచ్చు.





























