DS Rao : దమ్మలపాటి శ్రీనివాసరావు గారు నిర్మాతగా పలు సినిమాలు తీసి, చేతులు కాల్చుకున్నారు. డిఎస్ రావు గా ప్రసిద్ధి చెందిన ఆయన సినిమాల అనుభవాలు, హీరోల తీరు, నిర్మాతల కష్టాల గురించి పలు ఇంటర్వ్యూ ల్లో మాట్లాడారు. దాసరి గారు చిన్న సినిమాలను తీయండి, కళను బతికించండి అంటూ చెబితే డిఎస్ రావు గారు చిన్న సినిమాలనే తీసి మునిగిపోయానంటూ కామెంట్స్ చేసారు.

చిన్న హీరోలు కక్కుర్తి పడకండి, నిర్మాతను బ్రతకనివ్వండి…
చిన్న హీరోలతో సినిమాలు తీసి నష్టాలను చూసానని, నేను చేసిన పెద్ద తప్పు అదేనని, అప్పట్లో 100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టగల సర్కిల్ ఉండగా చిన్న సినిమాలను నమ్ముకుని మునిగా అంటూ మాట్లాడారు. అదే ఒకవేళ పెద్ద సినిమా, ఒక పెద్ద హీరోతో తీసుంటే కనీసమైనా డబ్బు వెనక్కి వచ్చేదని, పెద్ద హీరోల మార్కెట్ వల్ల నష్టాలు తప్పేవని, అదీకాక ఒకవేళ నష్టమే వస్తే పెద్ద హీరోలు తమ నెక్స్ట్ సినిమా అవకాశమో లేకపోతే రెమ్యూనరేషన్ తగ్గించడమో లాంటి చర్యల ద్వారా ఆదుకుంటారని అన్నారు. చిన్న హీరోలు మరీ కక్కుర్తి పడుతారంటూ వాఖ్యణించారు. పిల్ల జమిందార్, మిస్టర్ నూకయ్య, ద్రోణ వంటి సినిమాలను నిర్మించిన డిఎస్ రావు పిల్ల జమిందార్ సినిమా వల్ల వచ్చిన లాభాలన్ని ఆ తరువాత వచ్చిన సినిమాతో పోయాయాని, కొన్నిరోజులు కూడా డబ్బు మొఖం చూడలేదని చెప్పారు. అప్పటికి నాని చిన్న హీరో కానీ రెమ్యూనరేషన్ తో పాటు ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూషన్ తన బావ కు ఇవ్వమంటే ఫ్రీగా ఇచ్చేసానని చెప్పారు. ఇక ద్రోణ సమయంలో జరిగిన సంఘటనలను చెప్పారు.

ద్రోణ సమయంలో గోకర్ణ లో సెట్ వేయాలని దర్శకుడు పట్టుబట్టాడని వైజాగ్ లో వేసుకోవచ్చు కదా అంటే, చివరకు నేనే సర్దుకోవాల్సి వచ్చిందని గోకర్ణ లో సెట్ వేసి వర్షాల కారణంగా ఇబ్బంది పడ్డామని చెప్పారు. ఇక ఆ సినిమా విడుదల పెండింగ్ పెట్టి నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి రామ్ గోపాల్ వర్మ సినిమా అడవి షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయించారని చెప్పారు. దీనివల్ల మీ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పారట. కానీ అడవి సినిమా డిజాస్టర్ అవడంతో ద్రోణ సినిమాకు డిస్ట్రిబ్యూటర్స్ దొరక్క ఇబ్బంది పడ్డామని అప్పటి కష్టాలను పంచుకున్నారు. ప్రస్తుతం సినిమాల్లో విలన్ గా కనిపిస్తున్నారు దమ్మలపాటి. కల్కి, దండుపాళ్యం వంటి సినిమాల్లో నటించారు.
































