భారత్ లో చాప కింద నీరులా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. మన దేశంతో పాటు ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా వైరస్ అదుపులోకి రావడం లేదు. దేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్ని సూచనలు చేస్తున్నా కొందరు మాస్క్ ధరించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

అయితే పలు దేశాలు మాత్రం కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. భారీగా జరిమానా విధించడం ద్వారా మాత్రమే వైరస్ ను అదుపు చేయడం సాధ్యమని భావిస్తున్నాయి. తాజాగా దుబాయ్ ప్రభుత్వం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తి విషయంలో కఠినంగా వ్యవహరించింది. పోలీస్ అధికారులు నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి ఏకంగా 10 లక్షల రూపాయలు జరిమానా విధించారు.

డైరెక్టర్ ఆఫ్ క్రిమినల్ ఇన్విస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ దుబాయ్ పోలీస్ బ్రిగేడియర్ జమాల్ సలేం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. పూర్తి వివరాల్లోకి వెళితే దుబాయ్ కు చెందిన ఒక యువకుడికి కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ నిర్ధారణ అయింది. అధికారులు అతడిని హోం క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించగా ఆ వ్యక్తి మాత్రం ఇష్టానుసారం బయట తిరిగాడు.
#Covid-infected #Dubai youth fined Dh50,000 over quarantine breach video https://t.co/69pATknSlk
— Khaleej Times (@khaleejtimes) September 12, 2020
సదరు వ్యక్తి క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించి కాఫీ షాపులో ఉన్న సమయంలో ఒక సెల్ఫీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో వైరల్ అయింది. విషయం తెలిసిన అధికారులు ఆ యువకుడిని పట్టుకుని 50 వేల దిర్హామ్స్ (భారతదేశ కరెన్సీల్లో పది లక్షలు) జరిమానా విధించారు. అధికారులు భారీ జరిమానాలు విధిస్తే మాత్రమే కరోనా కట్టడి సాధ్యమవుతుందని…. ప్రజలు నిబంధనలు పాటిస్తారని చెబుతున్నారు.































