దేశంలో కరోనా పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. రోజుకో లక్షల సంఖ్యలో కేసులు నమోదు కాగా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కేసుల సంఖ్య అధికంగా ఉండడంతో ఆస్పత్రిలోని మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఈ క్రమంలోనే చాలా ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ క్రమంలోనే గోవా మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలో పరిస్థితులు మరీ దారుణంగా మారాయి. ఈ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండడంతో ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా ఆక్సిజన్ లభించక ఎనిమిది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో ఈ ఆస్పత్రిలో గత కొంత కాలం నుంచి ఆక్సిజన్ అందక మరణించిన వారి సంఖ్య 83 కు చేరింది.
ఆస్పత్రిలో రోజు ఆక్సిజన్ కొరత వల్ల బాధితులు చనిపోతుంటే ఆసుపత్రి వర్గాలు మాత్రం ఆక్సిజన్ కొరత వల్లే ప్రాణాలు కోల్పోయారని ధృవీకరించడం లేదు. కేవలం కరోనా తీవ్రత అధికంగా ఉండటం వల్లే రోగుల మృతి చెందుతున్నారని వైద్యులు సూచించినప్పటికీ, ఆస్పత్రిలోని నర్సులు, రోగుల బంధువులు రాత్రి సమయంలో ఆక్సిజన్ సరఫరాలో తీవ్ర హెచ్చుతగ్గులు ఏర్పడటం వల్లే కరోనా బాధితులు మృత్యువాత పడుతున్నట్లు చెబుతున్నారు.
ఈ విధమైనటువంటి ఆక్సిజన్ కొరత సమస్య కేవలం గోవా ఆసుపత్రిలో మాత్రమే కాకుండా ఈ విధమైనటువంటి దారుణ పరిస్థితులు దేశవ్యాప్తంగా నెలకొన్నాయని, ఆక్సిజన్ లభించక ఎంతోమంది బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు.




























