Good News : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను 3.64 శాతం పెంచింది. ఈ పెంపు 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుంది. కాబట్టి, ఇప్పటి వరకు ఉన్న 26.39 శాతం డీఏకి ఇప్పుడు 3.64 శాతం కలిపితే, మొత్తం డీఏ 30.03 శాతానికి చేరుతుంది.

ఈ పెంపుతో పాటు, ప్రభుత్వం జూన్ నెల జీతంతో పాటు కొత్త డీఏను కూడా చెల్లిస్తుంది. అంటే, 2023 జనవరి 1 నుంచి 2025 మే 31 వరకు వచ్చే డీఏ బకాయిలన్నింటినీ ఒకేసారి ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు.
ఇంకా, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు డీఏ బకాయిలను 28 దఫాల్లో చెల్లిస్తారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులకు 10 శాతం డీఏ బకాయిలను ప్రాన్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. మిగిలిన 90 శాతం బకాయిలను 28 వాయిదాల్లో జూన్ నెల జీతంతో చెల్లిస్తుంది.
యూజీసీ, ఏఐసీటీఈ పే స్కేల్స్ ఉద్యోగులకు డీఏ 38 శాతం నుంచి 42 శాతంకి పెంచారు. రాష్ట్రంలోని ఉద్యోగులకు 5 డీఏ బకాయిలు చెల్లించవల్సి ఉంది.
ఇటీవల రాష్ట్ర కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు ఉద్యోగులకు 2 డీఏలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో ఒక డీఏ తక్షణమే ఇవ్వనున్నారు. రెండో డీఏను మరో 6 నెలల్లో ఇస్తామని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా డీఏ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా డీఏ పెంపు ఉత్తర్వులు జిల్లా, మండల, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్ చార్జ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. అలాగే ఎయిడెడ్ సంస్థలు, యూనివర్సిటీల్లో పని చేసే టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందికి కూడా వర్తిస్తుంది.































