మెగాహీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి కెబుల్ బ్రిడ్జీ మీదుగా ఐకియా వైపు స్పోర్ట్స్ బైక్ పై వెళ్తుండగా ప్రమాదం జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్ తేజ్ ను వెంటనే స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు దగ్గరలో ఉన్నటువంటి మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసిన పోలీసులు అతనిని మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇకపోతే సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో భాగంగా పలు విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది.
సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ రికార్డు పరిశీలించినట్లయితే సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జి పై గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన సమయానికి సాయి ధరమ్ తేజ్ 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారని తెలియజేశారు.
సాధారణంగా కేబుల్ బ్రిడ్జి పై కేవలం గంటకు 40 కిలోమీటర్ల వేగం అనుమతి కాగా సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన ప్రాంతంలో కేవలం 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక సాయి ధరమ్ తేజ్ నడిపిన ట్రైంఫ్ కంపెనీ రేసింగ్ బండి తన పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదని, ఎల్బీ నగర్ కు చెందిన బూర అనిల్ కుమార్ అనే వ్యక్తి దగ్గరసాయి ధరమ్ తేజ్ కొన్నప్పటికీ ఇప్పటివరకు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో ఇప్పటికే ఆ బైక్ అనిల్ కుమార్ పేరు పై ఉంది.
ఇదే బండి నెంబర్ పై గత ఏడాది అధిక వేగంతో ప్రయాణం చేస్తున్నందుకుగాను రూ. 1135 చలానా పెండింగ్ లో ఉంది. అయితే సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ చలానా కట్టినట్లు సమాచారం. అయితే ఆ వ్యక్తి ఎవరు అనే విషయాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా ప్రత్యక్ష సాక్షులను విచారించగా కేవలం అతివేగం కారణంగానే యాక్సిడెంట్ జరిగిందనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు.































